వైరల్‌ అవుతున్న సుస్మితా సేన్‌ బెల్లీ డ్యాన్స్‌

మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌ నాలుగు పదుల వయసులో చక్కటి శరీరాకృతిని మెయింటేన్‌ చేస్తూ అంతటి క్లిష్టమైన డ్యాన్స్‌ చేయడం మామూలు విషయం కాదు. 1999లో తాను నటించిన ‘సిర్ఫ్‌తుమ్‌’ చిత్రంలోని దిల్బర్‌‌ పాటకు సుస్మిత తన జిమ్‌లో డ్యాన్స్‌ చేశారు. చేతులు పైకి పెట్టి నడుము తిప్పుతూ చేసిన డ్యాన్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ బెల్లీ డ్యాన్స్‌ సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

ఇప్పటివరకూ ఈ వీడియోను ఎనిమిది లక్షల మందికిపైగా లైక్‌ చేశారు. లక్షకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఇటీవల విడుదలైన ‘సత్యమేవ జయతే’ చిత్రంలో ప్రముఖ డ్యాన్సర్‌ నోరా ఫతేహి ఈ పాట రీమిక్స్‌ వెర్షన్‌లో నటించింది. ఈ పాటకు కూడా విపరీతమైన క్రేజ్‌ ఉంది. రీమిక్స్‌ వెర్షన్‌ను దాదాపు 18 కోట్ల మందికిపైగా వీక్షించారు. అత్యధిక వ్యూస్‌ వచ్చిన తొలి బాలీవుడ్‌ పాటగా రికార్డు సృష్టించింది. ఒరిజినల్‌ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌ డ్యాన్స్‌ కంపోజ్‌ చేశారు. చివరిగా 2015లో ‘నిర్భాక్’ అనే బెంగాలీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సుస్మిత. ప్రస్తుతం ఆమె పలు రియాల్టీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తోంది. త్వరలో ఆమె ‘హ్యాపీ యానివర్సరీ’ అనే చిత్రంలో నటించబోతుంది సుస్మితా.