జగన్‌ మోహన్‌ రెడ్డి చేయగలిగిందే చెబుతారు: ఎస్వీ కృష్ణారెడ్డి

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేయగలిగిందే చెబుతారని, ఆయన అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పడుతున్న తపన తనను కదిలించిందన్నారు. పాదయాత్ర ద్వారా వైఎస్‌జగన్‌ ప్రజల బాధను అర్థం చేసుకున్నారని చెప్పారు. దివంగత నేత వైఎస్సార్‌లాగే ఆయన ప్రజల కోసం తపిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్‌లాగే జగన్‌ ఆలోచనలు ఉన్నాయన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకుండా వైఎస్‌ జగన్‌ వ్యవహరిస్తున్న తీరు హర్షణీయం అన్నారు. ఆయన లాంటి స్పూర్తి అందరికి రావాలని చెప్పారు. ప్రజలతో మమేకమై నవరత్నాలు ప్రకటించారని, అవి పేద ప్రజలకు ఎంతో ఉపయోగ పడతాయన్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజల భవిష్యత్‌ బాగుంటుందన్నారు. వైఎస్‌ జగన్‌లాంటి వ్యక్తి ఇప్పుడు రాష్ట్రానికి అవసరమని, ఆయనను గెలిపించాలని ప్రజలను కోరారు.

రాజకీయ అవసరాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించవద్దని ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి కోరారు. తాము హైదరబాద్‌లో సంతోషంగా ఉన్నామన్నారు. సినీ ఇండస్ట్రీలో ప్రాంతీయ బేధాలు లేవని, అంతా కలిసే ఉంటామని చెప్పారు. ఎన్టీఆర్‌, వైఎస్సార్‌లాగే వైఎస్‌ జగన్‌ ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారని, ఆయన ఓపిక అభినందనీయమని ప్రశంసించారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు చూసిన జగన్‌.. ఒక విజన్‌తో కృషి చేస్తున్నాన్నారు. వైఎస్‌ జగన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.