పబ్లిసిటీ కోసమే అంటూ బురద చల్లకండి: కాజల్‌

‘మీటూ’ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న వారి జాబితా క్రమంగా పెరిగిపోతుంది. ఇప్పటికే బాలీవుడ్‌, టాలీవుడ్‌ నుంచి ‘మీటూ’ ఉద్యమానికి.. సమంత, అనుపమ పరమేశ్వరన్‌, ఐశ్వర్యరాయ్‌, గాయని చిన్మయి శ్రీపాద తదితరులు ప్రముఖ హీరోయిన్‌లు మద్దతు తెలిపారు.తాజాగా ఈ జాబితాలోకి నటి కాజల్‌ అగర్వాల్‌ కూడా చేరారు. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్న మహిళలకు తాను మద్దతిస్తానని అంటున్నారు కాజల్‌. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ‘మీటూ’ ఉద్యమంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

‘మహిళల్ని హింసించే రాక్షసుల గురించి నోరు విప్పి చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి. తాము ఎదుర్కొన్న సమస్యల గురించి బయటపెడుతూ తమకు తామే మద్దతు తెలుపుకొంటున్న మహిళలందరినీ నేను ప్రోత్సహిస్తున్నాను. ఇప్పటివరకు తమ అభిప్రాయాలను వెల్లడించిన మహిళల పట్ల ఎలాంటి దారుణ ఘటనలు జరిగాయో నేను ఊహించలేను. మనం ఒకరికి ఒకరు సహకరించుకోవాలి. కష్టకాలంలో తోడుగా, నిజాయతీగా నిలవాలి. కేవలం పబ్లిసిటీ కోసమే నటీమణులు తమ వేధింపుల గురించి బయటపెడుతున్నారని అనుకునేవారందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. వారిని తక్కువ చేసి చూస్తూ.. ఇంకా బురద చల్లాలని చూడకండి.’ అని వెల్లడించారు కాజల్.