నన్ను ‘లోక్లాస్‌ గర్ల్‌’ అంటావా.. రూ.50 కోట్ల దావా వేస్తా: రాఖీ సావంత్‌

బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తాపై రూ.50 కోట్ల పరువునష్టం దావా వేస్తానని నటి రాఖీ సావంత్‌ అన్నారు. ప్రముఖ నటుడు నానా పటేకర్‌ తనను పదేళ్ల క్రితం ఓ సినిమా సెట్‌లో వేధించారని తనుశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయన అలా ప్రవర్తించడంతో ఆమె ప్రత్యేక గీతం నుంచి తప్పుకొన్నారు. ఈ విషయంలో తనుశ్రీకు చాలా మంది ప్రముఖులు మద్దతు తెలిపారు. ఇదే సరైన సమయంగా కొందరు ఆర్టిస్టులు చిత్ర పరిశ్రమలో తమకు ఎదురైన వేధింపులను బయటపెట్టారు.

ఈ నేపథ్యంలో తనుశ్రీ తప్పుకొన్న ఆ ప్రత్యేక గీతంలో నటించిన రాఖీ సావంత్‌ ఇటీవల మీడియాతో మాట్లాడారు. తనుశ్రీకి పిచ్చి పట్టిందని, పదేళ్లు ఆమె కోమాలో ఉందని విమర్శించారు. నానా పటేకర్‌, గణేష్‌ ఆచార్యపై తనుశ్రీ చేస్తున్నవన్నీ అసత్య ఆరోపణలే అన్నారు. అవకాశాలు లేకపోవడంతో డబ్బు కోసమే నానా పటేకర్‌జీపై ఆరోపణలు చేసిందని పేర్కొన్నారు.

ఈ విమర్శల నేపథ్యంలో రాఖీ సావంత్‌పై తనుశ్రీ దత్తా రూ.పదికోట్లకు పరువు నష్టం దావా వేశారు. ‘తనుశ్రీ పేరు, వ్యక్తిత్వం దెబ్బతీసేలా మాట్లాడినందుకు రాఖీ సావంత్‌పై పరువు నష్టం దావా వేశాం’ అని తనుశ్రీ తరఫు న్యాయవాది తెలిపారు.తనుశ్రీ పరువునష్టం దావాపై రాఖీ తాజాగా స్పందించారు. ఆమెపై మండిపడుతూ.. పరోక్షంగా బెదిరించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేశారు. ‘నాపై రూ.పది కోట్ల పరువు నష్టం దావా వేసింది. నన్ను ‘లో క్లాస్‌ గర్ల్‌’ అన్న ఆమెపై రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేస్తా’ అని రాఖీ వీడియోలో అన్నారు.