ట్విటర్‌కు ‘అర్జున్‌ రెడ్డి’ దోస్త్‌.. బైబై

టాలీవుడ్‌ నటుడు రాహుల్‌ రామకృష్ణ ట్విటర్‌ నుంచి వైదొలిగారు. మరో నటుడు ప్రియదర్శితో కలిసి ఆయన నటించిన కామెడీ సినిమా ‘మిఠాయ్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్‌ ముందు బోల్తా కొట్టి నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. సినిమా పరాజయం చవిచూడటంతో ఆయన తన ట్విటర్ ఖాతాను శనివారం తొలగించారు. ఖాతాను తొలగించే ముందు రామకృష్ణ పోస్ట్‌ చేసిన సందేశం తాలుకా స్క్రీన్‌ షాట్‌ ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ‘మేము సినిమా బాగా రావటానికి చాలా ప్రయత్నాలు చేశాం. చివరికి మా ప్రయాత్నాలేవి ఫలించలేదు. సినిమాకు ఇలాంటి ఫలితం వస్తుందని ముందే అంచనా వేశాను. చిత్ర పరాజయానికి అందరికీ నేనే క్షమాపణలు తెలుపుతున్నా. దర్శకుడు ఆలోచన, ఊహలను ఇప్పటికి గౌరవిస్తున్నా’ అని తన చివరి ట్వీట్‌లో రామకృష్ణ పోస్ట్ చేశారు. అర్జున్‌ రెడ్డి, భరత్‌ అనే నేను, గీతా గోవిందం వంటి విజయవంతమైన చిత్రాలలో నటించిన అతను ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేశాడు.