HomeTelugu Newsవరల్డ్‌‌ బ్యాడ్మింటన్‌‌లో తెలుగు కుర్రాడు సాయి ప్రణీత్ అదుర్స్

వరల్డ్‌‌ బ్యాడ్మింటన్‌‌లో తెలుగు కుర్రాడు సాయి ప్రణీత్ అదుర్స్

11 13అర్జున అవార్డుకు ఎంపికైన ఆనందంలో ఉన్న తెలుగు షట్లర్‌‌ సాయి ప్రణీత్‌‌ వరల్డ్‌‌ బ్యాడ్మింటన్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో అదరగొడుతున్నాడు. తొలి రెండు రౌండ్లను ఈజీగా దాటేసిన ప్రణీత్‌‌.. ప్రిక్వార్టర్స్‌‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌‌ పని పట్టి క్వార్టర్‌‌ఫైనల్‌‌కు దూసుకెళ్లాడు. అమెరికా షట్లర్​ బీవెన్​ జాంగ్​ను చిత్తు చేస్తూ పీవీ సింధు కూడా క్వార్టర్స్‌‌లో అడుగుపెట్టింది. కానీ, గత మ్యాచ్‌‌లో లిన్‌‌డాన్‌‌కు షాకిచ్చిన ప్రణయ్‌‌.. టాప్​ సీడ్​ కెంటా మొమోటా అడ్డు దాటలేకపోయాడు. శ్రీకాంత్‌‌ తనకంటే తక్కువ ర్యాంకర్‌‌ చేతిలో ఓడి ఇంటిదారి పట్టాడు.

అద్భుతఫామ్‌‌లో ఉన్న తెలుగు షట్లర్లు బి. సాయిప్రణీత్‌‌, పీవీ సింధు ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో పతకం సాధించేందుకు అడుగు దూరంలో నిలిచారు. అలవోక విజయాలతో ఈ ఇద్దరూ క్వార్టర్‌‌ఫైనల్లోకి ప్రవేశించగా.. అగ్రశ్రేణి ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్‌‌, హెచ్‌‌ఎస్‌‌ ప్రణయ్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లోనే ఓడిపోయారు.

గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లో వరల్డ్‌‌ నం.19 ప్రణీత్‌‌ 21-19, 21-13 తేడాతో ప్రపంచ ఎనిమిదోసీడ్‌‌ అంటోని సిన్సుక గింటింగ్‌‌ (ఇండోనేసియా)పై సునాయాస విజయం సాధించాడు. 42 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌‌లో పక్కా ప్లాన్స్‌‌తో బరిలోకి దిగిన ఇండియన్‌‌ ప్లేయర్‌‌ అందుకు తగ్గ ఫలితాన్ని రాబాట్టాడు. ఫస్ట్​ గేమ్‌‌ స్టార్టింగ్‌‌లో 0-3తో వెనుకంజలో ఉన్న ప్రణీత్‌‌ ఒక్కసారిగా వ్యూహం మార్చి 8-5తో లీడ్‌‌ సాధించాడు. అదే జోరులో 11-8తో విరామానికి వెళ్లాడు. విరామానంతరం పుంజుకున్న ఆంటోని అద్భుతమైన స్మాష్‌‌లతో 14-12తో ఆధిక్యం దక్కించుకున్నాడు. ఈస్థితిలో ప్లాన్‌‌ మార్చిన ప్రణీత్‌‌ కచ్చితమైన బేస్‌‌లైన్‌‌షాట్లతోపాటు నెట్‌‌వద్ద చురుగ్గా కదిలి 18-19తో ఆధిక్యాన్ని తగ్గించాడు. ఇదే జోరులో వరుసగా మూడు పాయింట్లు సాధించి తొలి గేమ్‌‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రెండోగేమ్‌‌లో దూకుడుగా ఆడిన ప్రణీత్‌‌ స్టార్టింగ్‌‌లోనే 6-2తో లీడ్‌‌లోకెళ్లాడు. ఈ దశలో ప్రణీత్‌‌ కొన్ని పొరపాట్లు చేయడంతోపాటు ఆంటోనీ పుంజుకుని 11-8తో ముందంజ వేశాడు. ఇక విరామానంతరం వరుసగా ఆరు పాయింట్లు సాధించి తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లిన ప్రణీత్‌‌.. అదే జోరులో గేమ్‌‌తోపాటు మ్యాచ్‌‌ను కైవసం చేసుకున్నాడు.

11a

2018 ఆసియా టీమ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌తోపాటు 2017 వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఆంటోనిని ఓడించిన ప్రణీత్‌‌ మరోసారి తన మ్యాజిక్‌‌ను చూపించి క్వార్టర్స్‌‌కు చేరుకున్నాడు. మరో మ్యాచ్​లో వరల్డ్‌‌ నం.10 శ్రీకాంత్‌‌ 14-21, 13-21తో కంటాఫోన్‌‌ వాంగ్‌‌చరోన్‌‌ (థాయ్‌‌లాండ్‌‌) చేతిలో ఓడిపోగా.. హెచ్‌‌ఎస్‌‌ ప్రణయ్‌‌ 19-21, 13-21తో డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌, వరల్డ్‌‌ నం.1 కెంటో మొమోటా (జపాన్‌‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల సింగిల్స్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లో ఐదో సీడ్‌‌ సింధు 21-14, 21-6తో తొమ్మిదో సీడ్‌‌ బీవెన్‌‌ జాంగ్‌‌ (అమెరికా)పై అలవోక విజయం సాధించింది. కేవలం 34 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌‌లో సింధు ధాటికి ప్రత్యర్థి నుంచి సమాధానం లేకపోయింది. క్వార్టర్స్‌‌లో జొనాథన్‌‌ క్రిస్టీ (ఇండోనేసియా)తో ప్రణీత్‌‌, తై జు యింగ్‌‌ (చైనీస్‌‌తైపీ)తో సింధు తలపడనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu