కత్రినా రిహార్సల్స్‌ వీడియో.. వైరల్‌

ప్రభుదేవా కొరియోగ్రఫీ తనను ఆశ్చర్యానికి గురి చేసిందని బాలీవుడ్‌ కథానాయిక కత్రినా కైఫ్‌ అన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్నసినిమా ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’. అమీర్‌ ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌, ఫాతిమా సనా షేక్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‌విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకుడు. యశ్‌ రాజ్ ఫిల్మ్స్‌ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది నవంబరు‌ 8న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాలో సురైయా అనే నర్తకిగా కత్రినా, ఫిరంగి పాత్రలో అమీర్‌ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘సురైయా..’ పాట ప్రోమోను విడుదల చేశారు. ఇందులో కత్రినా, ఆమిర్‌ కలిసి స్టెప్పులేశారు. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు. కత్రినా అందం, డ్యాన్స్‌ చేసే తీరుకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ పాటకు యూట్యూబ్‌లో విశేషమైన స్పందన లభించింది.

‘సురైయా..’ పాట రిహార్సిల్స్‌లో భాగంగా తీసిన వీడియోను కత్రినా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రభుదేవా కొరియోగ్రఫీని ప్రశంసించారు. డ్యాన్స్‌ సాధన చేస్తున్న సమయంలో కోపంతో కన్నీరు పెట్టుకున్నట్లు చెప్పారు. ‘సురైయా..’ పాటకు కొరియోగ్రఫీ చూసినప్పుడు అది జాజ్?‌, బ్యాలెట్?‌, ఫోక్?‌.. ఇవికాకపోతే మరే పద్ధతికి చెందిన డ్యాన్స్‌ అని ఆలోచించా. కానీ ప్రభుదేవాతో డ్యాన్స్‌ అంటే.. ఆయన స్టైల్‌ను మనం నిర్వచించలేం. అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన తన కొరియోగ్రఫీతో పాటకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేశారు. రిహార్సల్స్‌ కోసం ఆయన నాతో చాలా సమయం గడిపారు. నేను ఆయన అనుకునే స్టైల్‌లో డ్యాన్స్‌ చేయడానికి చాలా సహాయం చేశారు. నాకు అది చాలా నచ్చింది. (కొన్ని క్షణాలు కోపంతో పెట్టుకున్న కన్నీరుని పక్కనపెడితే). కానీ ముగింపు చాలా సరదాగా గడిచిపోయింది’ అని కత్రినా పోస్ట్‌ చేశారు. రిహార్సల్స్‌ వీడియోను చూస్తే ఆమె ఎంత కష్టపడ్డారో అర్థమౌతుంది. ఈ వీడియోను కేవలం 8 గంటల్లో 19 లక్షల మందికిపైగా చూశారు.