వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కత్తితో దాడిచేసిన నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు. మూడో రోజు అతడిని విమానాశ్రయ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్న సందర్భంలో చేతులు, ఛాతిలో నొప్పి ఉన్నట్టు అతడు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తొలుత స్థానిక వైద్యుడు దేవుడుబాబుతో వైద్య పరీక్షలు చేయించారు. బీపీ, షుగర్ సాధారణ స్థితిలోనే ఉన్నాయని, చాతిలో నొప్పి, చేతులు తిమ్మిరిగా ఉన్న నేపథ్యంలో కేజీహెచ్‌లో నిపుణులతో వైద్యం చేయిస్తే మంచిదని, మెరుగైన వైద్యం కోసం శ్రీనివాసరావును కేజీహెచ్‌కు తరలించాలని వైద్యుడు దేవుడుబాబు పోలీసులకు సూచించారు. దీంతో విచారణ బృందం హుటాహుటిన నిందితుడిని కేజీహెచ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే, తనకు వైద్య సహాయం వద్దని, తన అవయవాలు తీసుకుపోండంటూ శ్రీనివాసరావు కోరుతున్నాడని వైద్యులు దేవుడుబాబు తెలిపారు. ఏ ఉద్దేశంతో నిందితుడు ఈ వ్యాఖ్యలు చేశాడనే దానిపై స్పష్టత లేదు. సుదీర్ఘ విచారణ క్రమంలోనే విసుగుతో ఇలా మాట్లాడి ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును సిట్ మూడో రోజు విచారిస్తుండగా ఈ పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. నవంబర్ 2వరకు నిందితుడిని విచారించేందుకు న్యాయస్థానం పోలీస్ కస్టడీకి అప్పగించింది. దీంతో ఇంకా కొన్ని రోజుల్లోనే విచారణ ముగియనుంది. అనంతరం కస్టడీ నుంచి తిరిగి కేంద్ర కారాగారానికి తరలించే సమయం దగ్గర పడుతున్న సమయంలో ఈ విధంగా శ్రీనివాసరావుకు వైద్యసాయం అందించాల్సి రావడంతో పోలీసులు కొంత ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. కేజీహెచ్ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేసుకు సంబంధించిన మిగతా వారి విచారణ కొనసాగుతోంది. క్యాంటీన్‌లో శ్రీనివాసరావుతో పాటు పనిచేసే సహచరులను విచారిస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగించనున్నారు.













