జైపూర్‌కి తరలి వెళ్లిన సెలబ్రిటీలు..!

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కుమారుడు కార్తికేయ, పూజా ప్రసాద్‌ల వివాహ వేడుక జయపుర‌లో జరగనుంది. అక్కడి కుకాస్‌లో ఉన్న ఐదు నక్షత్రాల హోటల్‌లో డిసెంబరు 30న ఈ వేడుక జరగనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజమౌళి కుటుంబంతోపాటు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు కూడా జైపూర్‌కి‌ చేరుకున్నారు. అక్కినేని నాగార్జున, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, ప్రణతి, అభయ్‌రామ్‌, ప్రభాస్‌, రానా, నాని, జగపతిబాబు తదితరులు జయపుర‌ విమానాశ్రయంలో ఉండగా తీసిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అనుష్క కూడా ఇప్పటికే అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

నవంబరులో కార్తికేయ, పూజల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబరు 28 నుంచి డిసెంబరు 30 వరకు మూడు రోజులపాటు వీరి వివాహ వేడుక జరగనుందట. శుక్రవారం రాత్రి ఘనంగా వివాహ విందు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. శనివారం సంగీత్‌, మెహెందీ వేడుకలు నిర్వహించనున్నారట. ఆదివారం కుటుంబ సభ్యులు, దాదాపు 300 మంది అతిథుల సమక్షంలో పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్‌-కార్తికేయ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. పూజా ప్రసాద్‌ గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక భక్తి గీతాలు ఆలపించారు.