HomeTelugu Newsఆ రెండూ పార్టీలు మాకు ప్రత్యర్థులే: కేటీఆర్‌

ఆ రెండూ పార్టీలు మాకు ప్రత్యర్థులే: కేటీఆర్‌

5
టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌2019వ సంవత్సరం తమకు బ్రహ్మాండమైన ఆరంభం ఇచ్చిందని.. 2020 కూడా మున్సిపల్‌ ఎన్నికల్లో ఘనవిజయంతో శుభారంభం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్‌ మాట్లాడారు. కొత్త దశకంలో కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అగ్రగామిగా ఎదుగుతుందన్నారు. వారంలో కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ సమావేశం జరుగుతుందని.. మున్సిపల్‌ ఎన్నికలకు సమాయత్తంపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. కొత్త మున్సిపల్‌ చట్టం సమర్థంగా అమలు చేయడమే తమ ముందున్న లక్ష్యమని కేటీఆర్‌ చెప్పారు. చట్టం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కౌన్సిలర్‌పై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫార్మాసిటీ ప్రారంభిస్తామని.. ఈనెల 3న ముంబయిలో జరగనున్న ఫార్మా సదస్సుకు హాజరవుతున్నట్లు తెలిపారు. నాలుగేళ్లలో ఫార్మా, టెక్స్‌టైల్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

2020-2030 దశకం టీఆర్‌ఎస్‌ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రానిదేనని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది తాను సీఎం అవుతానన్న చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు. ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఏపీ సహా పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సత్సంబంధాలు కొనసాగిస్తామన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి వదులుకుంటానని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొనడం ఆయన వ్యక్తిగతమని చెప్పారు. కాంగ్రెస్‌ సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ అని.. దాన్ని తక్కువగా అంచనా వేయబోమని తెలిపారు. తమకు ఇప్పటికీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సేనని చెప్పారు. తన చిన్నప్పుడు బీజేపీ ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందని ఈ సందర్భంగా కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

ప్రగతిశీల రాష్ట్రాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని.. అందులోనూ రాజకీయాలు ఆలోచిస్తే దేశానికి మంచిది కాదని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఐదు ట్రిలియన్‌ డాలర్ల కల సాకారం కావాలంటే రాష్ట్రాలను ప్రోత్సహించాలని సూచించారు. హైదరాబాద్‌ పాతబస్తీకి మెట్రో రైలు తప్పకుండా వస్తుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఎంఐఎంతో స్నేహ సంబంధాలు ఉంటాయని.. ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీతో కలిసి పోటీచేసే ప్రసక్తే లేదన్నారు. తమకు రాజకీయాల్లో శత్రువులు ఎవరూలేరని..బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ తమకు ప్రత్యర్థులేనన్నారు. కేంద్రం సాయం చేయకపోయినా ఐటీలో హైదరాబాద్‌ది అగ్రస్థానమేనని చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu