కేటీఆర్‌కు ఉపాసన ట్వీట్‌.. వెయిట్ చేయాలన్న కేటీఆర్!

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన అపోలో గ్రూప్స్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ బిజీగా ఉంటారు. అయితే రామ్‌ చరణ్‌ గురించి సోషల్‌ మీడియాలో అప్‌డేట్స్‌ ఇస్తూ ఉండే ఉపాసనకు భారీగానే ఫాలోయింగ్‌ ఉంది. మెగా అభిమానులు తన సోషల్‌మీడియా ఖాతాలను ఫాలో అవుతుంటారు.

అయితే తాజాగా ఉపాసన ఓ దివ్యాంగుల వసతి గృహానికి వెళ్లి అక్కడ స్వయంగా అందరికీ వడ్డించి కడుపునింపారు. అంతేకాకుండా.. దుప్పట్లను కూడా పంచారు. అయితే ఈ హాస్టల్‌కు ఓ నూతన భవనాన్ని మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ‘తెలంగాణ ప్రభుత్వం ఎంతో బాగా పనిచేస్తోంది. అయితే మాకు మీ తరుపునుంచి ఇంకొంచెం ప్రేమ కావాలి. దయచేసి ఈ అమ్మాయిలకు సహాయాన్ని అందించండి. నాకు చేతనైన సహాయాన్ని నేను చేస్తున్నాను. వీరందరికి నూతన భవనాన్ని మంజూరు చేయండి’ అని ట్వీట్‌ను కేటీఆర్‌కు ట్యాగ్‌ చేశారు.

దీనికి ప్రతిగా కేటీఆర్‌ బదులిస్తూ.. పాఠశాలకు నూతన భవనాన్ని మంజూరు కావడం సంతోషం.. అయితే వసతి గృహానికి నూతన భవనాన్ని మంజూరు చేయాలంటే డిసెంబర్‌ 11 వరకు మనం ఎదురుచూడాలి అంటూ బదులిచ్చారు.