ఆమెతో డేటింగ్‌లో ఉన్నా.. త్వరలో పెళ్లి చేసుకుంటాం

బాలీవుడ్ హీరో వరుణ్‌ధావన్‌ డిజైనర్‌ నటాషా దలాల్‌‌తో ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు కలిసి ఉన్న ఫొటోలు అనేక సందర్భాల్లో బయటికి వచ్చాయి. తాజాగా వరుణ్‌ ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో పాల్గొన్నారు. ఇప్పటికే దీని షూటింగ్‌ పూర్తయింది. త్వరలో షో ప్రసారం కాబోతోంది.

ఈ సందర్భంగా వరుణ్‌ ప్రేమ బంధం గురించి కరణ్‌ ప్రశ్నించారు. దీనికి ఆయన ‘అవును.. ఆమెతో డేటింగ్‌లో ఉన్నా. మేమిద్దరం ప్రేమికులం. ఆమెను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నా. త్వరలోనే అదీ జరుగుతుంది’ అని అన్నారు. దీనికి వెంటనే కరణ్ సరదాగా‌ స్పందిస్తూ.. ‘నా కుమారుడ్ని మరొకరికి ఇచ్చేస్తున్నట్లుంది’ అని పేర్కొన్నారు.

గతంలో నటాషాతో ప్రేమ గురించి మీడియా వరుణ్‌ను అడిగింది. కానీ అప్పుడు ఆయన చెప్పడానికి నిరాకరించారు. ‘నేను దీని గురించి మాట్లాడితే ప్రజలు దాన్ని మరో స్థాయికి తీసుకెళ్తారు. అందుకే చెప్పడం ఇష్టం లేదు. ప్రేమలో ఉన్నాను లేదా లేను.. అని చెబితే ప్రజలు అంతటితో ఆగరు. గుడ్డి వార్తలు రాస్తారు. నటాషా ఓ సాధారణ అమ్మాయి. తనకు సాధారణ జీవితం గడపడమే ఇష్టం. ఆమెను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది’ అని వరుణ్‌ చెప్పారు.

View this post on Instagram

Happy diwali 👷‍♂️👩🏻‍⚕️

A post shared by Varun Dhawan (@varundvn) on