వెంకటేశ్‌ కుమార్తె రిసెప్షన్‌లో సినీ తారల సందడి.. చిరంజీవి చుట్టూ అలనాటి అందాల తారలు

హీరో వెంకటేశ్‌ కుమార్తె ఆశ్రిత పెళ్లి రిసెప్షన్‌లో సినీ తారలు సందడి చేశారు. చిరంజీవి దంపతులు, కృష్ణంరాజు దంపతులతోపాటు రాధిక, టబు, ఖుష్బూ, నదియా, సుహాసిని, మీనా, ప్రభాస్‌, రానా తదితరులు వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోల్ని రాధిక, ఖుష్బూ సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ‘వెంకటేశ్‌ కుమార్తె పెళ్లి రిసెప్షన్‌.. ఈ అద్భుతమైన సాయంత్రం, మధురమైన జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి. కృష్ణంరాజు, చిరంజీవితో ఎంతో సరదాగా సమయం గడిచింది’ అని రాధిక ట్వీట్‌ చేశారు. ‘హ్యాండ్సమ్‌ మెగాస్టార్‌ చిరంజీవి చుట్టూ అందమైన మహిళలు రాధిక, నదియా, టబు, సుహాసిని, జయసుధ, మీన, ఆయన సతీమణి సురేఖ’ అని ఖుష్బూ పోస్ట్‌ చేశారు.

ఆశ్రిత, హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు వినాయక్‌ రెడ్డిల వివాహం మార్చి 24న జైపూర్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పెళ్లి రిసెప్షన్‌ను గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.