చిన్మయి ఆరోపణలపై వైరాముత్తు స్పందన

ప్రముఖ తమిళ సాహిత్య రచయిత వైరాముత్తు తనను హోటల్‌ గదికి రమ్మన్నాడని గాయని చిన్మయి శ్రీపాద మంగళవారం సోషల్‌మీడియా వేదికగా తెలిపిన సంగతి తెలిసిందే. ఓ కార్యక్రమం కోసం స్విట్జర్లాండ్‌ వెళ్లామని, వేదికపై పాట పాడామని ఆమె అన్నారు. ‘కార్యక్రమం పూర్తయిన తర్వాత అందరూ వెళ్లిపోయారు. కానీ ఆర్గనైజర్‌ నన్ను, మా అమ్మను అక్కడే ఉండమన్నారు. లూసర్న్‌లో ఉన్న హోటల్‌లో వైరాముత్తును కలవాలని చెప్పారు. ఎందుకని ప్రశ్నిస్తే.. కోపరేట్‌ చేయడం కోసమని అన్నారు. దానికి నేను ఒప్పుకోలేదు. ఇండియాకు పంపమని అడిగా. ‘నీకు ఇక కెరీర్ లేదు’ అని ఆయన నాతో అన్నారు. మేం తర్వాత విమానానికి ఇండియా వచ్చేశాం’ అని ఆమె ట్వీట్లు చేశారు. అంతేకాదు వైరాముత్తు తన స్నేహితురాల్ని కూడా లైంగికంగా వేధించారని చిన్మయి చెప్పిన విషయం తెలిసిందే. తన స్నేహితురాలి సందేశాల్ని ఆమె ట్విటర్‌లో షేర్‌ చేశారు.

అయితే ఈ వ్యాఖ్యల్ని వైరాముత్తు ఖండించారు. అమాయకులను అవమానించడం ఇప్పుడు ఫ్యాషన్‌ అయిపోయిందని అన్నారు. ఈ మేరకు ఆయన తమిళంలో ట్వీట్‌ చేశారు. ‘అమాయకుల్ని అవమానించడమే ఇప్పుడు ప్రజలకు ఫ్యాషన్‌ అయిపోయింది. ఇప్పటికే చాలా సార్లు నాపై పలువురు తప్పుడు ఆరోపణలు చేశారు. అందులో ఇప్పుడు ఇది ఒక్కటి. నేను ఇలాంటివి చెవిలో వేసుకోను.. వీటిలో నిజం లేదు. కాలమే నిజాన్ని బయటపెడుతుంది’ అని ఆయన పోస్ట్‌ చేశారు. దీన్ని చిన్మయి రీట్వీట్‌ చేస్తూ.. ‘అబద్ధాలకోరు’ అని రాశారు.