రివ్యూ: నక్షత్రం

నటీనటులు: సందీప్ కిషన్, సాయి ధరం తేజ్, రెజీనా, ప్రగ్యజైస్వాల్, తనీష్, ప్రకాష్ రాజ్ తదితరులు
సంగీతం: భీమ్స్, భరత్ మధుసూదన్, హరిగౌర, మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ నరోజ్
ఎడిటింగ్: శివ వై ప్రసాద్
నిర్మాతలు: శ్రీనివాసులు, వేణుగోపాల్, సజ్జు
కథ, దర్శకత్వం: కృష్ణవంశీ
సందీప్ కిషన్, సాయి ధరం తేజ్ వంటి ఇద్దరు యంగ్ హీరోలను తీసుకొని ‘నక్షత్రం’ అనే సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణవంశీ. శుక్రవారం ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
హైదరాబాద్ సిటీలో జరుగుతోన్న బాంబ్ పేలుళ్లకు కారణం ఎవరో తెలుసుకోవడానికి సిటీ పోలీస్ కమీషనర్(ప్రకాష్ రాజ్) డేగ అనే టీమ్ ను సిద్ధం చేస్తారు. దీనికి అలెక్సాండర్(సాయి ధరం తేజ)ను ప్రతినిధిగా నియమిస్తారు. అయితే అప్పటినుండి అలెక్సాండర్ కనిపించకుండా పోతాడు. మరోపక్క రామారావు(సందీప్ కిషన్)అనే కుర్రాడు పోలీస్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో కమీషనర్ కొడుకు రాహుల్(తనీష్) ఓ పోలీస్ ను కాలితో తన్నాడని అతడిని కొడతాడు రామారావు. దీంతో పగబట్టిన రాహుల్, రామారావుకి పోలీస్ ఉద్యోగం రాకుండా చేస్తాడు. ఈలోగా సిటీలో మరో బాంబ్ పేలుడు జరుగుతుంది. అసలు ఆ బాంబ్ పేలుళ్లకు కారణం ఎవరు..? వాటిని అరికట్టడానికి నియమించిన పోలీస్ ఆఫీసర్ అలెక్సాండర్ ఏమయ్యాడు..? రామారావు చివరకు పోలీస్ అయ్యాడా..? కమీషనర్ కొడుకుకి, బాంబ్ పేలుళ్లకు ఏమైనా సంబంధం ఉందా..? రెజీనా, ప్రగ్య జైస్వాల్ ల పాత్రలు ఎలా ఉన్నాయి..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

ప్లస్ పాయింట్స్:
సందీప్ కిషన్, తనీష్
పాటల చిత్రీకరణ
మైనస్ పాయింట్స్:
కథ, స్క్రీన్ ప్లే
ఎడిటింగ్
సంగీతం

విశ్లేషణ:
రొటీన్ కథలకు కాలం చెల్లిపోతున్న ఈరోజుల్లో మరోసారి అలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టాలనుకున్న దర్శకుడు కృష్ణవంశీ ప్లాన్ బెడిసికొట్టింది. డ్రగ్స్, పోలీసులు, బాంబ్ పేలుళ్లు వీటి చుట్టూ కృష్ణవంశీ రాసుకున్న కథ ఏమాత్రం ఆసక్తికరంగా లేదు. పైగా తన కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే తో మరింత విసిగించేశాడు. అసలు సినిమాలో పాత్రలను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఫస్ట్ ఫ్రేమ్ నుండి ఎండ్ ఫ్రేమ్ వరకు సినిమా చెప్పుకోదగిన ఒక్క సన్నివేశం కూడా లేకపోవడం బాధాకరం. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాలతో పోలిస్తే.. నక్షత్రం తేలిపోయింది.
సందీప్ కిషన్ తన పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు. తన బెస్ట్ ఇవ్వడానికి తపించాడు. సాయి ధరం తేజ్ పాత్రను మొదట్లో బాగా ఎలివేట్ చేయడంతో ఆ పాత్రను ముగించిన తీరు ప్రశంసనీయంగా అనిపించదు. ఇక ఇద్దరు హీరోయిన్లు గ్లామర్ ప్రదర్శనకు పరిమితమయ్యారు. తన సినిమాల్లో హీరోయిన్లను అందంగా చూపించే కృష్ణవంశీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో కాకపోయినా.. ఓ మోస్తరుగా వారిని పోట్రేట్ చేశాడు. ఈ సినిమాకు ప్లస్ పాయింట్ తనీష్ నటన. విలన్ పాత్రలో ఒదిగిపోయాడు.
సినిమాను ఎక్కువ శాతం సహజంగా చూపించాలని లైట్స్ వినియోగించకుండా చిత్రీకరించారు. అయితే సినిమా చూసే ఆడియన్స్ కు మాత్రం ఇది పెద్దగా రుచించదు. సంగీతం చెప్పుకోదగిన స్థాయిలో లేదు. సినిమాలో అనవసరపు సన్నివేశాలను ట్రిమ్ చేసి ఓ అరగంట సినిమాను ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. మొత్తానికి రొటీన్ కథ,కథనాలతో ప్రేక్షకులను విసిగించి మరోసారి తన సినిమాలకు దూరంగా ఉంటే మంచిదని నిరూపించాడు దర్శకుడు కృష్ణవంశీ.
రేటింగ్: 1.5/5