‘రోషగాడు’ టీజర్‌

తమిళ నటుడు విజయ్‌ ఆంటోని ‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఆ తర్వాత విజయ్‌ నటించిన ప్రతి చిత్రం తెలుగులోనూ విడుదలవుతోంది. ఇప్పుడు పోలీస్‌ పాత్రలో అలరించేందుకు విజయ్‌ మరోసారి సిద్ధమయ్యాడు. విజయ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రోషగాడు’. ఈ సినిమాలో నివేదా పేతురాజు హీరోయిన్‌గా నటిస్తుంది. గణేశా దర్శకుడు. గురువారం ‘రోషగాడు’ టీజర్‌ను మూవీ యూనిట్‌ అభిమానులతో పంచుకుంది.

పోలీసులను కించపరుస్తూ మాట్లాడిన వారిని ఉద్దేశించి ‘పుడింగిలే.. అవును పుడింగిలే. పోలీసులంటే పెద్ద పుడింగిలే. మీరు రాత్రి పూట హాయిగా ఫ్యాన్‌ వేసుకుని నిద్ర పోతుంటే మేము కుక్కలా రోడ్లపై కాపలాకాస్తుంటాం కదా! మేము పుడింగిలమే. నీ తాగుబోతు మొగుడు తాగేసి రోడ్డుపై పడి చావకూడదని ఆపి పైపు పెట్టి చెక్‌ చేసి జాగ్రత్తగా ఇంటికి పంపిస్తున్నామే.. మేము పుడింగిలమే’ అంటూ పోలీస్‌ విధి నిర్వహణ గురించి విజయ్‌ ఆంటోని చెబుతున్న పవర్‌ఫుల్‌ డైలాగ్‌లతో టీజర్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత సన్నివేశాల్లో రౌడీలను చితక్కొడుతూ విజయ్‌ ఆంటోనీ కనిపించారు. టీజర్‌ చూస్తే, సినిమాను పూర్తి తమిళ నేటివిటీకి దగ్గరగా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఒక నిజాయతీ కలిగిన పోలీసు అధికారి తన విధి నిర్వహణలో ఎలాంటి సంఘ విద్రోహక శక్తులను ఎదుర్కొన్నాడు. వాటిని ఎలా తుదముట్టించాడన్నదే ‘రోషగాడు’ కథలోని అంశం.

విజయ్‌ ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై ఫాతిమా విజయ్‌ ఆంటోని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్‌ ఆంటోనీనే ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.