టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే: విజయశాంతి

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కి ఓటు వేస్తే, మోడీకి వేసినట్లేనని, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాటు మళ్లీ చేయొద్దని కాంగ్రెస్‌ నేత విజయశాంతి ప్రజలను కోరారు. శనివారం శంషాబాద్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన బహిరంగ సభలో విజయశాంతి మాట్లాడారు. ‘అన్నలారా..! అక్కలారా! అసెంబ్లీ ముగిసింది.. పార్లమెంట్‌ మొదలైంది. ఇది కాంగ్రెస్‌కు, బీజేపీకి జరిగే యుద్ధం. అంటే రాహుల్‌గాంధీ-మోడీలకు జరిగే యుద్ధం. ప్రజాస్వామ్యం బతకాలని రాహుల్‌గాంధీ పోరాడుతుంటే, దాన్ని ఖూనీ చేసి, మోడీ నియంతలా పాలించారు. మళ్లీ పరిపాలించాలని అనుకుంటున్నారు. ఈసారి దేశ ప్రజలు ఆ అవకాశం ఇవ్వరు. బీజేపీను చూస్తుంటే ప్రతి ఒక్కరికీ భయం వేస్తోంది. మోడీ ఏ సమయంలో ఏ బాంబు వేస్తారోనని ప్రజలు వణికిపోతున్నారు. ఒక ప్రధానికి ఇది కాదు లక్ష్యం. జీఎస్‌టీ, నోట్లరద్దు, పుల్వామా ఇలా ప్రతి దాని విషయంలో ప్రజల్లో భయం మొదలైంది. ఈసారి మీరంతా ఆలోచించుకుని ఓటు వేయాలని కోరుతున్నా.’

‘ఇక్కడ టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే. ఎందుకంటే మోడీనే కేసీఆర్‌ను నడిపిస్తున్నారు. మోడీ వేసుకునేది 10లక్షల కోటు.. ఆయన ప్రజల్ని అడిగేది ఓటు.. కానీ ఆయనకు కావాల్సింది అన్ని బ్యాంకుల్లోని నోటు. దేశం మొత్తం ముక్తకంఠంతో మోడీని వద్దని చెబుతోంది. కానీ, ఒకే ఒక వ్యక్తి మాత్రం ఆయనకు మద్దతు చెబుతున్నారు. ఆయనే దొరా అనే కేసీఆర్‌. 2018 ఎన్నికల్లో కేసీఆర్‌కు మోడీ సహాయం చేశారు. ఎన్నికల సంఘాన్ని తీసుకొచ్చి కేసీఆర్‌కు అప్పగించారు. ఆయన ఓట్లు గల్లంతు చేసి, ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేశారు. అన్ని రకాలుగా మోసం చేసి, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. ఆ ప్రేమతోనే ఇక్కడ కాంగ్రెస్‌ను ఖతం చేయాలని కేసీఆర్‌ కంకణం కట్టుకున్నారు. అందుకోసం మా పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి, ఆశ చూపెట్టి కొంటున్నారు. అందరి ముందు తండ్రీ కొడుకులు మోడీని తిడతారు. కానీ, వెనుక వారంతా కలిసి పనిచేస్తారు. ఏదో రకంగా కొడుకును సీఎం చేసి, మోడీతో కలిసి ఢిల్లీలో చక్రం తిప్పాలని కేసీఆర్‌ చూస్తున్నారు. ఇది జరగదు. ఇలాంటివి ఎన్నో చూసింది కాంగ్రెస్‌. ప్రజలారా.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాటు మళ్లీ చేయొద్దు.’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

‘నేటి నుంచి ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నాం. ఆమ్‌ ఆద్మీ బీమా యోజన తెచ్చి భర్త చనిపోయిన వారికి సాయం చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే. పెద్ద నోట్ల రద్దుతో మోడీ ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. నల్లధనం తెస్తానని మోడీ మాయ చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి సోనియా రుణం తీర్చుకోవాలి’ అని కాంగ్రెస్‌ నేత సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

‘నల్ల డబ్బు తెప్పిస్తామన్నారు.. కానీ ఇక్కడి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి డబ్బు తరలివెళ్లింది. ఇటువంటివి చూస్తుంటే మనం మోసపోయామని అర్థమవుతోంది. ప్రజలను విభజించే పార్టీ ఎప్పటికీ మంచి చేయదు. దేశ సమగ్రత కోసం కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి. ఎంతోమంది మహిళలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్‌ పార్టీనే. సోనియా గాంధీ ఒక వైపు కుటుంబాన్ని చూసుకొంటూ.. మరో వైపు పార్టీనీ చూసుకొన్నారు. అధికారం అందుబాటులోకి వచ్చినా తీసుకోని గొప్పతనం సోనియాదే. వచ్చే ఎన్నికల్లో ఈ గడ్డపై కాంగ్రెస్‌ను గెలిపించి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి. నేను చేవెళ్ల అభివృద్ధి కోసం ఎవరితోనైనా పోరాడతాను. రాహుల్‌ను ప్రధాని చేయడమే మన లక్ష్యం’ అని అన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates