వైరల్‌ అవుతున్నకపిల్‌ శర్మ పెళ్లి వీడియో!

ప్రముఖ కమెడియన్‌, బాలీవుడ్‌ నటుడు కపిల్‌ శర్మ నిన్న వివాహం చేసుకున్నాడు.. తన ప్రేయసి గిన్నీ ఛత్రత్‌తో కపిల్‌ వివాహం పంజాబ్‌లోని జలంధర్‌ నగరంలో బుధవారం అట్టహాసంగా జరిగింది. అయితే కపిల్‌ పెళ్లికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. తాళి కట్టిన తర్వాత ఏడడుగులు నడవడానికి ముందు కపిల్‌ మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ‘కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నాపై ఉంచినందుకు ధన్యవాదాలు. నేను ఇప్పుడు గిన్నీతో కలిసి ఏడడుగులు వేయబోతున్నాను. మీరే చెప్పండి.. ఏడడుగులు వేయనా? పారిపోనా?’ అని చమత్కరించారు. ఈ వీడియోను కపిల్‌ అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అవుతోంది. ‘ఇదే మంచి సమయం కపిల్‌.. త్వరగా పారిపో..’ అంటూ నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.

‘కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్’ కామెడీ షోతో కపిల్‌ దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ కార్యక్రమానికి పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ న్యాయనిర్ణేతగా వ్యవహరించేవారు. పెళ్లివేడుకకు నవజ్యోత్‌ కూడా హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. వారం రోజుల తర్వాత ముంబయిలో కపిల్‌ గ్రాండ్‌గా వివాహ విందును ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది.