వైసీపీకి ఓటేస్తే మన ఇంట్లో మనం అద్దెకు ఉండాల్సిందే: చంద్రబాబు

దుష్టచతుష్టయం కుట్రలపై పోరాటాలకు అందరూ సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్ని దాడులు చేయాలో అన్నీ చేస్తున్నారని, న్యాయస్థానం కొట్టేసిన వంశీ పాత కేసును తిరగదోడి.. నాన్ బెయిల్ వారెంట్ జారీ చేయించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం పార్టీ నేతలతో టెలికాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. వైసీపీ నాయకులు పోలీసులపైనా దాడులకు తెగబడుతున్నారని, ఓటమి భయంతో వైసీపీ అన్ని అరాచకాలకూ పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అరాచకాలు చేస్తున్నా ప్రజల అండ మనకు శ్రీరామరక్ష అని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ నేతల మనో నిబ్బరాన్ని దెబ్బతీసే కుట్రలకు ధీటుగా బదులివ్వాలని పిలుపునిచ్చారు. మైలవరంలో రణరంగం సృష్టించిన వైసీపీ నేతలు.. పోలీసులు, జవాన్లపై చెప్పులు, రాళ్లతో దాడులకు దిగడం హేయమైన చర్య అని అభివర్ణించారు.

పొన్నూరులో స్కూలు పిల్లల ఆటోపై వైసీపీ నేతల దౌర్జన్యం తగదని హెచ్చరించారు. అద్దెకుండే వాళ్లపై దౌర్జన్యాలు, అర్ధరాత్రి ఇళ్లు ఖాళీ చేయించడం, గర్భిణిని జుట్టుపట్టుకుని ఈడ్చటం, వృద్ధులనే కనికరం లేకుండా అర్ధరాత్రి సామాన్లు బయట వేయడంపై చంద్రబాబు మండిప్డారు. వైసీపీకి ఓటేస్తే మన ఇంట్లో మనం అద్దెకు ఉండాల్సిందేనని ఎద్దేవా చేశారు.

పేదల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ సంఘీభావ యాత్రలు చేపట్టాలని అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పేదలపై వైసీపీ కుట్రలకు నిరసనగా ప్రతి రోజూ గంటసేపు ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. టీడీపీ బీసీ నేతలపై బీజేపీ నేతలు ఐటీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. నిన్న పుట్టా సుధాకర్పై, మొన్న బీదా మస్తాన్ రావుపై దాడులు చేశారని దుయ్యబట్టారు. కడప జిల్లా మొత్తం పుట్టా సుధాకర్‌కు మద్దతుగా కదిలివచ్చిందని, ఈ స్ఫూర్తి రాష్ట్రం మొత్తం కనిపించాలని కోరారు. వైసీపీకి చెందిన వ్యాపారులపైనా, టీఆర్‌ఎస్‌ కాంట్రాక్టర్లపైనా ఐటీ దాడులు ఎందుకు చేయడం లేదని నిలదీశారు.