రాఘవ లారెన్స్‌ ట్రస్ట్‌కు చిరంజీవి భారీ విరాళం

స్టార్‌ కొరియోగ్రాఫర్‌, హీరో రాఘవ లారెన్స్‌కు చెందిన ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు మెగాస్టార్‌ చిరంజీవి రూ.10 లక్షల విరాళం అందజేశారు. బుధవారం హైదరాబాద్‌లో లారెన్స్‌ నటించిన ‘కాంచన 3’ ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది. ఈ వేడుకలో భాగంగా చిరంజీవి తరఫున ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ చెక్కును లారెన్స్‌కు అందజేశారు. లారెన్స్‌ తన ట్రస్ట్‌ తరఫున ఇప్పటివరకు వందలాది చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయించి వారికి కొత్త జీవితాలను ప్రసాదించారు. మున్ముందు అనారోగ్యంతో బాధపడుతున్న మరెందరో చిన్నారులను ఇదే విధంగా ఆదుకుంటానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ‘ముని’ సిరీస్‌లో భాగంగా వస్తోన్న చిత్రమిది. ఓవియా, వేదిక హీరోయిన్‌లుగా నటించారు. కోవై సరళ రాఘవకు తల్లిగా కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్‌ 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.