Homeతెలుగు Newsపోటీ ఎక్కడినుంచో ఫిబ్రవరిలో ప్రకటిస్తా: పవన్‌

పోటీ ఎక్కడినుంచో ఫిబ్రవరిలో ప్రకటిస్తా: పవన్‌

1 6ప్రజల ఆకాంక్షల ప్రకారం రాజకీయ వ్యవస్థ నడవట్లేదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల ప్రజలను నాయకులు కేవలం ఓటు బ్యాంకుగా పరిగణించినంత కాలం ఇక్కడ అభివృద్ధి ఎప్పటికీ జరగదని వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో ‘జన తరంగం’ పేరిట ఐదు రోజుల పాటు పర్యటించిన ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసే విషయం ఫిబ్రవరిలో వెల్లడిస్తానని చెప్పారు. ప్రతిపక్ష నేత జగన్‌ అసెంబ్లీకి వెళ్లరు.. అనంతపురం కరవు గురించి ప్రశ్నించరని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో తన పర్యటన అనుభవాలను మీడియాకు వెల్లడించారు.

‘నవంబరు 27 వరకు జిల్లాలో 47 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. గతంలో ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెట్టి రెయిన్‌ గన్స్‌ ఏర్పాటు చేసింది. కానీ రైతులకు అవి ఏ మాత్రం ఉపయోగపడడం లేదు. నీళ్లు లేక కనీసం ఒక ఎకరం కూడా తడవలేదని రైతులే స్వయంగా తెలిపారు. రెయిన్‌ గన్ల వల్ల ఎంతో మందికి కమీషన్లు మాత్రం దక్కాయి. అయితే రాష్ట్రంలోని రైతులంతా సంతోషంగా ఉన్నారని చంద్రబాబు జాతీయ మీడియాను నమ్మించారు. క్షేత్ర స్థాయిలో రైతులు పడుతున్న వెతలను కప్పిపుచ్చి భ్రమలు కల్పిస్తున్నారు. ఇలాంటి రైతులందరికీ జనసేన మద్దతు తెలుపుతోంది. ఓ దశాబ్దంపాటు ఈ ప్రాంతంపై సరైన ప్రణాళిక లేకపోతే అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోయే ప్రమాదముందని వాతావరణశాఖ గతంలో హెచ్చరించింది. చేనేత కార్మికుల బాధలు చూస్తుంటే ఆవేదన కలుగుతోంది. దీని పరిష్కారం కోసం దీర్ఘకాలిక పరిష్కారం కోసం జనసేన ఆలోచిస్తోంది.

జిల్లాలో ఉన్న యువతకు ప్రతిభ ఉంది. వీరి ప్రతిభ పక్క రాష్ట్రాల వారికి, ఇతర దేశాల వారికి ఉపయోగపడుతోంది. అలాంటి వీరిని ఈ ప్రాంత అభివృద్ధికే ఎందుకు వాడుకోలేకపోతున్నాం. యువతకు ప్రత్యేక కేటాయించి తక్కువ భూమిలో ఎక్కువ ఉత్పాదన చేసేలా ప్రణాళిక తీసుకురావాలి. సమగ్రమైన నీటి ప్రణాళిక అమలు చేయాలి. ప్రతిపక్షానికి నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే అసెంబ్లీలో అనంతపురం కరవు గురించి మాట్లాడాలి. వలసల గురించి మాట్లాడాలి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొని తిట్టుకుంటే ఏ ప్రయోజనం ఉండదు’ అని పవన్‌ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu