ముఖ్యమంత్రి మీద క్రిమినల్ కేసు పెట్టండి

వైసీపీ అధినేత జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగి 10 రోజులైనా కేసులో పురోగతి లేదని మాజీ ఐజీ, వైసీపీ నేత ఇక్బాల్‌ అన్నారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ జగన్‌ను పథకం ప్రకారం హత్య చేయాలనుకున్నారని ఆరోపించారు. ‘నిందితుడు పదివేల ఫోన్ కాల్స్ మాట్లాడారని చెబుతున్నారు. ఎవరెవరితో మాట్లాడారో క్లియర్‌గా ఎందుకు చెప్పడం లేదు? మొదటి రోజు నుంచి అడుగుతున్నా థర్డ్ పార్టీ విచారణ కు ఎందుకు ఇవ్వడం లేదు?’ అని ఇక్బాల్‌ ప్రశ్నించారు. సాక్ష్యాన్ని తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేసిన ఆయన.. ముఖ్యమంత్రి చంద్రబాబు మీద క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. కేసు విచారణ చేస్తున్న అధికారులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ హస్తం లేనిపక్షంలో తక్షణమై థర్డ్‌ పార్టీ విచారణకు అంగీకరించాలని ఇక్బాల్‌ డిమాండ్‌ చేశారు.