Homeతెలుగు Newsప్రజల ఆశీస్సులే నా బిడ్డను కాపాడాయి: విజయమ్మ

ప్రజల ఆశీస్సులే నా బిడ్డను కాపాడాయి: విజయమ్మ

జగన్‌పై దాడి జరిగిన తర్వాత తొలిసారి వైఎస్‌ విజయమ్మ లోటస్‌ పాండ్‌లో మీడియాతో మాట్లాడారు. విశాఖ విమానాశ్రయంలో దాడికి గురైన తన కుమారుడు జగన్మోహన్‌రెడ్డి కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి తమ కుటుంబం రుణపడి ఉంటుందని ఆమె అన్నారు. కోట్ల మంది ప్రజల ఆశీస్సులే తన బిడ్డను కాపాడాయని విజయమ్మ అన్నారు. తన కుమారుడికి ఇది పునర్జన్మ అని పేర్కొన్నారు.

6 11

‘రాష్ట్ర ప్రజానీకానికి మా కుటుంబానికి 40-45 ఏళ్ల అనుబంధం ఉంది. వైఎస్‌ఆర్‌ సీఎం అయ్యాక ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నారు. నాన్న నన్ను ఒంటరి చేయలేదమ్మా.. ఇంతపెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చి వెళ్లారంటూ జగన్‌ ఎప్పుడూ చెబుతుంటారు. గొంతులో దిగాల్సిన కత్తి భుజానికి దిగడం నిజంగా నా బిడ్డ అదృష్టమే. జగన్‌ కోలుకుంటున్నారు. తిరిగి ప్రజాజీవితంలోకి అడుగు పెట్టేందుకు రేపటి నుంచి పాదయాత్ర పునః ప్రారంభించనున్నారు. ఏడు సంవత్సరాలుగా జగన్‌.. కుటుంబం కంటే ప్రజలతోనే ఎక్కువగా గడుపుతున్నారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేపట్టారు. అప్పుడు ప్రజల నుంచి జగన్‌కు వచ్చిన అనూహ్య స్పందన మరిచిపోలేం. అనంతరం ప్రజా సమస్యలపై దీక్షలు చేపట్టడం, సమైక్యాంధ్ర ఉద్యమంలో జగన్‌ చురుగ్గా పాల్గొన్నారు. ప్రజలను కష్టాలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను ప్రజలు ఆదరిస్తున్నారు.

ప్రతపక్ష నేతపై దాడి జరుగుతుందని నాలుగు నెలల క్రితమే ఒకాయన చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే దాడి జరిగింది. గుంటూరు, గోదావరి జిల్లాల్లో జగన్‌ను అంతమొందించేందుకు రెక్కీ జరిగినట్లు తెలిసింది. అక్కడ కుదరకపోవడంతోనే విశాఖ విమానాశ్రయంలో దాడికి పాల్పడ్డారు. వైఎస్‌ చనిపోయినప్పటి నుంచి మా కుటుంబం అవమానాలపాలు అవుతూనే ఉంది. జగన్‌తో పాటు ఆయన తల్లి, చెల్లి, భార్యపైనా ఎన్నో విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. అన్నింటినీ మా కుటుంబం భరిస్తూ వస్తోంది. వైఎస్‌ కాంగ్రెస్‌పార్టీకి ఎంతో సేవ చేశారు. కానీ ఆ పార్టీ మాత్రం నియంతృత్వ ధోరణితో మమ్మల్ని పట్టించుకోలేదు. కాంగ్రెస్‌, టీడీపీ కలిసి మా కుటుంబాన్ని వేధిస్తున్నారు. సీబీఐ, ఐటీ, ఈడీ దాడుల పేరుతో ఆర్థికంగా అణగదొక్కాలని చూస్తున్నారు. నా బిడ్డను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు. దేశంలో ఇప్పటివరకు ఏ నేతను కూడా ఇంతలా వేధించిన దాఖలాలు లేవు’ అంటూ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!