HomeTelugu Newsవైఎస్‌ వివేకానంద రెడ్డిది హత్యే నిర్ధారించిన పోలీసులు

వైఎస్‌ వివేకానంద రెడ్డిది హత్యే నిర్ధారించిన పోలీసులు

8 13మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డిది హత్యేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆయన హత్యకు గురైనట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు. కొద్ది సేపటి క్రితమే కడపలోని రిమ్స్‌ వైద్యులు పోస్టుమార్టం పూర్తిచేయడంతో ఆయన భౌతికకాయాన్ని పులివెందులకు తరలించారు. ఆయన శరీరంలో ఏడు చోట్ల బలమైన గాయాలు ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. తలలో రెండు వైపులా కత్తితో పొడిచిన గాయాలు ఉన్నాయని, అలాగే, ఛాతి, చేతిపైనా కత్తిపోట్లు ఉన్నట్టు తెలిపారు. మొత్తంగా శరీరంపై ఏడు చోట్ల కత్తి పోట్లు ఉన్నాయని స్పష్టంచేశారు.

వివేకానంద రెడ్డి శుక్రవారం ఉదయం పులివెందులలోని తన నివాసంలో రక్తపు మడుగులో పడి ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తంచేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. హత్య కోణంలోనే పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. పులివెందులలో వివేకా నివాసానికి వెళ్లిన ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ సుమారు రెండు గంటల పాటు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత దీన్ని హత్యగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు, వివేకా మరణం హత్యగా తేలడం సంచలనంగా మారింది. ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? దీనిలో కుట్ర కోణాలేంటనే దానిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారనేది తేల్చేందుకు అన్ని కోణాల్లో దృష్టిసారిస్తున్నారు.

పులివెందులలోని వివేకా నివాసానికి వైఎస్‌ విజయమ్మ చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆమె బోరున విలపించారు. ఇప్పటికే వైసీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వైసీపీ అధినేత జగన్‌ ఈ సాయంత్రం పులివెందులకు చేరుకోనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu