కడపలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’‌:ఎన్నికల సంఘం సీరియస్‌ ‌!

ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదలకు సంబంధించి ఏప్రిల్ 10 తేదీన ఈసీ విడుదల చేసిన ఉత్తర్వులు అమల్లో వున్నప్పటికీ కడప జిల్లాలోని రెండు థియేటర్లలో ఆ సినిమా ప్రదర్శనపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్‌ అయింది. దీనిపై కలెక్టర్‌ నుంచి నివేదిక వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది చెప్పారు. సంబంధిత థియేటర్లపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్ర ప్రదర్శన అడ్డుకోవడంలో జాయింట్‌ కలెక్టర్‌ విఫలమయ్యారని, ఆయనపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసినట్టు చెప్పారు. అలాగే, ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కలెక్టర్‌ విచారణ కొనసాగుతోందని ద్వివేది స్పష్టంచేశారు.