రసవత్తరంగా కడప మైదుకూరు రాజకీయాలు..!


మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ మేరకు 10వ తేదీన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అయితే పార్టీలోకి ఎవరొచ్చినా సీటు తనదేనని టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ధీమాగా చెబుతున్నారు. ఈ పరిణామాలు మైదుకూరు రాజకీయాన్ని రంజుగా మార్చేశాయి. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి ఆరుసార్లు శాసనసభ్యుడిగా గెలుపొంది మంత్రిగా పనిచేసిన డీఎల్‌ రవీంద్రారెడ్డి ఇప్పుడు సైకిల్‌ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. 2014 నుంచి రాజకీయాలకు కొంతదూరంగా ఉంటున్న ఆయన.. ఈసారి ఎన్నికల బరిలో నిలవాలని పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు ప్రధాన పార్టీలైన టీడీపీ లేదా వైసీపీలో ఏదో ఒక పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే జనవరి 12న ఇడుపులపాయకు వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను కలిసిన డీఎల్‌ అనుచరులు తమ నేతకు సీటు ఇవ్వాలని అడిగారు. ఎమ్మెల్యే ఇవ్వడం కుదరదన్న జగన్‌. ఎమ్మెల్సీ ఇస్తానని ప్రతిపాదించారు. అక్కడ లాభం లేదనుకున్న డీఎల్‌ ఆ వెంటనే టీడీపీ నేతలతో మంతనాలు జరిపారు.

రెండుసార్లు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి డీఎల్ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సానుకూల సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా ఈ నెల 10న అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహణకు సిద్ధమయ్యారు. అదేరోజు డీఎల్‌ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించే వీలుంది. డీఎల్‌ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరతారనే ప్రచారం జోరందుకోవడంతో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ అప్రమత్తమయ్యారు. తనకున్న పరిచయాలతో పావులు కదుపుతున్నారు. టికెట్‌ తనదేనని ధీమాగా ఉన్నారు. ఈనెల 1న మైదుకూరు వచ్చిన మంత్రి ఆదినారాయణరెడ్డి సుధాకర్‌ యాదవ్‌ మాటలకు బలం చేకూర్చేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభ్యర్థిగా పుట్టానే బరిలో ఉంటారని ప్రకటించారు. అప్పటి నుంచి పుట్టా మరింత ఉత్సాహంగా ఉన్నారు. డీఎల్‌ వచ్చినా తన సీటుకు ఇబ్బంది ఉండదని నమ్ముతున్నారు. టికెట్‌ ఇస్తామన్న హామీ రావడంవల్లే తెదేపాలో చేరేందుకు డీఎల్‌ సిద్ధపడ్డారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాంటిదేమీ లేకుండా అటువైపు అడుగులు వేసే అవకాశం లేదని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డీఎల్‌కు సీటు కేటాయిస్తారా? పుట్టాకు ఖరారు చేస్తారా? అన్నది ఉత్కంఠ కలిగిస్తుంది.

CLICK HERE!! For the aha Latest Updates