కీర్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విజయ్‌ అభిమానులు

ప్రముఖ తమిళ నటుడు విజయ్‌, కీర్తి సురేశ్‌ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారు కాని ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. అయితే సినిమాలోని కొన్ని స్టిల్స్‌ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఒక ఫొటోలో కీర్తి సురేశ్‌ సోఫాపై కూర్చుని ఉండగా.. విజయ్‌ నేలపై కూర్చున్నారు. సెలబ్రిటీ స్టైలిస్ట్‌ సమంత జగన్‌ ఏదో మాట్లాడుతున్నట్లు కన్పించారు. ‌అయితే ఫొటోలో విజయ్‌ కాలి వేళ్లపై కీర్తి కాలు ఉండడంతో విజయ్‌ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా కీర్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కీర్తి అభిమానులు ఈ ఫొటోను షేర్‌ చేస్తూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.కీర్తి, విజయ్‌ జంటగా ‘భైరవ’ చిత్రంలో నటించారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల చెన్నైలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శ్రీధర్‌ ఓ పాటను కంపోజ్‌ చేశారు.

జూన్‌ 22న విజయ్‌ పుట్టినరోజు పురస్కరించుకుని టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నారు. అయితే తూత్తుకూడి ఘటన నేపథ్యంలో అభిమానులు ఎవ్వరూ తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దని విజయ్‌ కోరారు. మరోపక్క ‘మహానటి’ చిత్రంతో ఘన విజయం అందుకున్న కీర్తి..ప్రస్తుతం ‘సామి 2’ ‘సందకోళి 2’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.