తెలుగు ప్రేక్షకులందరికీ కృజ్ఞతలు: కార్తీ

కార్తీ, సాయేషా సైగల్ జంటగా నటించిన చిత్రం ‘చినబాబు’. పల్లెటూరి కథతో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కార్తీ అన్న, ప్రముఖ హీరో సూర్య నిర్మించగా పాండిరాజ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి విడుదల చేశారు. సత్యరాజ్‌, సూరి, శత్రు ఇతర ప్రముఖ పాత్రలలో నటించిన ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందించారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హీరో కార్తీ, సాయేషా సైగల్, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ట్రాఫిక్ జామ్ కారణంగా కార్తీ, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఆటోలో సక్సెస్ మీట్‌కి వచ్చి ప్రేక్షకులను, అభిమానులను ఆశ్చర్యపరిచారు.

 

ఈ వేడుకలో హీరో కార్తీ మాట్లాడుతూ.. ”ఈ సినిమా ఎంతో ప్రేమతో చేసిన సినిమా. పక్కా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా. ఒక ఫ్యామిలీ ఎన్ని ఇబ్బందులొచ్చినా కలిసే ఉండాలని చెప్పే సినిమా. ముఖ్యంగా అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమను దర్శకుడు ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. నిజంగా ఈ సినిమాని అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు కామెడీ సన్నివేశాలకు హాయిగా నవ్వుకుంటున్నారు. క్లైమాక్స్‌లో ఏడుస్తున్నారు కూడా. ప్రతి ప్రేక్షకుడు ఎంతో ఆనందంగా థియేటర్ నుంచి బయటకి వస్తుండడం నాకు సంతోషంగా ఉంది. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మన వైస్ ప్రెసిడెంట్ గారు ఈ సినిమా చూసి ఇలాంటి సినిమా మన సమాజానికి తప్పకుండా అవసరమని ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ కూడా చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ముఖ్యంగా డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. అలాగే మీడియా వారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలామంది సినిమా చూసి చాలా బాగుందని చెప్పారు. నిర్మాత రవీందర్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఇక్కడ పెద్ద హిట్ అవడానికి ఆయన కృషి ఎంతో ఉంది. అన్నయ్య సూర్య నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాని ఆదరించి హిట్ చేసినందుకు.. తెలుగు ప్రేక్షకులందరికీ చాలా కృజ్ఞతలు” తెలిపారు.