దిల్‌ రాజు మరో ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా ‘శ్రీనివాస కళ్యాణం’

యువ నటుడు నితిన్‌ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం “శ్రీనివాస కళ్యాణం”. ఈ చిత్రానికి వేగ్నేశ సతీష్‌ దర్శకుడు, దిల్‌ రాజుకే శతమానం భవతి లాంటి నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ మూవీ ఇచ్చిన డైరెక్టర్‌ కావడంతో నిర్మాణం నుంచే దీని మీద మంచి ఆసక్తి నెలకొంది. ఆ సినిమాను డీల్‌ చేసిన తీరు ఫ్యామిలీ ఆడియన్స్‌ని కట్టిపడేసేలా చేసిన టేకింగ్‌ అతనికి పెద్ద ప్రమోషన్‌ ఇచ్చాయి. ఇప్పుడు తీస్తున్న శ్రీనివాస కళ్యాణం కూడా అదే రీతిలో ఉంటుందని ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్‌ చేస్తూ తీస్తున్నట్టు టాక్‌. శతమానం భవతిలో యాంత్రిక జీవనంలో పడి విదేశాల్లో ఉంటూ అమ్మానాన్నలను నిర్లక్ష్యం చేసే పిల్లల గురించి చూపించిన వేగ్నేశ సతీష్‌ ఈ సారి వివాహం నేపధ్యంలో మానవ సంబంధాలు చూపించబోతున్నారట.

డబ్బుంటే చాలు అన్ని అవే సమకూరుతాయని నమ్ముతూ నార్త్‌ లో సెటిల్‌ అయిన పెద్ద మనిషి పాత్రలో ప్రకాష్‌ రాజ్‌ నటిస్తుండగా తెలుగింట పెళ్ళికి వచ్చి అనుంబంధాల గొప్పదనం తెలుసుకునే క్రమం సెకండ్‌ హాఫ్ లో ఉంటుందట. నితిన్‌, రాశి ఖన్నాల మధ్య కెమిస్ర్టీ ఊహించిన దాని కన్నా బాగా వచ్చిందని నిత్యం మనం చూసే పెళ్లిళ్లలో ఉండే సందడి చిన్నా చితకా గొడవలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ ఒకే తాటిపైకి రావడం ఇవన్నీ హార్ట్‌ టచింగ్‌ గా రూపొందించారట. గతంలో ఇదే టైటిల్‌ తో ముప్పై ఏళ్ళ క్రితం వెంకటేష్‌ హీరోగా ఓ చిత్రం వచ్చింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్టు. ఇది కూడా అదే తరహాలో దిల్‌ రాజుకు మరో సక్సెస్‌ ఇస్తుందని అనుకుంటున్నారు.