నానితో శృతి!

కమల్‌ హాసన్‌ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన నటి శృతి హాసన్‌. ఈమె కెరీర్‌లో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. సక్సెస్‌ కోసం చాలా కాలం ఎదురుచూసిన ఈ భామ హిట్ వచ్చిన తరువాత కూడా ఆ ఇమేజ్‌ను కాపాడుకోలేకపోయారు. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చిన హిట్స్‌ దక్కకపోవటంతో కెరీర్ కష్టాల్లో పడింది. దీంతో నెమ్మెదిగా సినిమాలు తగ్గించేశారు. గత ఏడాది కాలంగా శృతి హాసన్‌ ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

అయితే ఇప్పుడు ఈ భామ వరుసగా తెలుగు సినిమాలకు కమిట్‌ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రవితేజ హీరోగా తెరకెక్కుతున్న అమర్ అక్బర్‌ ఆంటోని సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. తాజాగా నాని కొత్త సినిమా జర్సీలో కూడా శృతినే హీరోయిన్‌ గా నటించనుందన్న ప్రచారం జరుగుతోంది. నాని హీరోగా మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో శృతి హాసన్‌ను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని క్రికెటర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాతో పాటు మహేష్ మంజ్రేకర్‌ దర్శకత్వంలో ఓ బాలీవుడ్ సినిమాలోనూ నటిస్తున్నారు శృతి హాసన్‌.