మరోసారి రవితేజతో ఇల్లి బేబి

ఒకప్పుడు టాలీవుడ్‌లో తన సన్నని నడుముతో, అంద చందాలతో ఉర్రూతలూగించి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన గోవా బ్యూటీ ఇలియానా కొన్నాళ్ల పాటు టాలీవుడ్‌కు దూరంగా ఉంటోంది. తెలుగులో దేవుడు చేసిన మనుషులు సినిమా తర్వాత కనిపించలేదు. బాలీవుడ్‌కు పయనమైన ఈ భామకు అక్కడ అవకాశాలు రాకపోయినా అక్కడే ఉండిపోయింది. ఇల్లీ బేబీ మళ్లీ తెలుగు సినిమాల్లో రీఎంట్రీ ఇస్తోందని, ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఒప్పుకుందని వార్తలు వచ్చాయి.

తాజాగా రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో ఇలియానా నటిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ దర్శకుడు శ్రీనువైట్ల ట్వీట్ చేశారు. రవితేజ ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు తెలిసింది. ఇలియానాతో పాటు ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ను మరో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. రవితేజతో ఇలియానాకు ఇది మూడో చిత్రం. గతంలో కిక్, దేవుడు చేసిన మనుషులు చిత్రాల్లో నటించింది.