3 రోజుల్లో 15 పర్యటనలు.. కేసీఆర్ ముమ్మర ప్రచారం

తెలంగాణ సీఎం కేసీఆర్‌ డిసెంబర్ 2 నుంచి 4 వరకు 15 చోట్ల ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. గురువారం వరకు ఆయన 76 సభలను పూర్తిచేసుకోగా శుక్రవారం 7 సభల్లో పాల్గొన్నారు. డిసెంబరు మొదటి తేదీ షెడ్యూలు మినహాయించి, వివరాలన్నింటినీ టీఆర్‌ఎస్ ప్రకటించింది. వచ్చేనెల రెండు లేదా మూడో తేదీన హైదరాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో భారీ బహిరంగ సభ జరపాలని పార్టీ భావిస్తోంది. దీనికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. డిసెంబరు 5న ప్రచారాన్ని గజ్వేల్‌తో ముగించాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది.

కేసీఆర్ పాల్గొనే ప్రచార సభల వివరాలు: డిసెంబర్ 2 న నాగర్‌కర్నూలు, చేవెళ్ల, పటాన్‌చెరు, హైదరాబాద్‌.. 3న సత్తుపల్లి, మధిర, కోదాడ, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, నల్గొండ.. 4న అలంపూర్‌, గద్వాల, మక్తల్‌, కొడంగల్‌, వికారాబాద్‌ నియోజకవర్గాల్లో ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు.