HomeTelugu Reviews24 కిస్సెస్‌ మూవీ రివ్యూ

24 కిస్సెస్‌ మూవీ రివ్యూ

టాలీవుడ్‌లో ‘అర్జున్‌రెడ్డి’, ‘ఆర్‌.ఎక్స్‌.100′ సినిమాతో ముద్దు స‌న్నివేశాల‌కి హ‌ద్దులు చెరిగిపోయాయి. అయితే వాటిలో కేవ‌లం ముద్దులే కాదు.. అందుకు త‌గ్గ కథ కూడా ఉంది కాబ‌ట్టే విజ‌యం సాధించాయి. ఆ సినిమాల తర్వాత ప్ర‌చార ప‌రంగా మాత్రం ద‌ర్శ‌క‌ నిర్మాత‌ల‌కి కొత్త దారులు తెర‌చుకున్నట్లైంది. ముద్దుల్నే ఎర‌గా వేసి ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అలా పేరులోనే ముద్దులున్న ’24 కిస్సెస్‌’ ప్ర‌చార చిత్రాల‌తో యువ‌త‌రం ప్రేక్ష‌కుల్ని బాగా ఆక‌ర్షించింది. ‘మిణుగురులు’ తో త‌న ప్ర‌తిభ‌ని నిరూపించుకున్న అయోధ్య‌కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు కావ‌డంతో క‌థ‌పై కూడా అంచ‌నాలున్నాయి. మ‌రి సినిమా ఎలా ఉందో చూద్దాం.

6 22

కథ: ఆనంద్ (అరుణ్ అదిత్‌) చిన్న పిల్ల‌ల సినిమాలకు ద‌ర్శ‌కుడు. పెళ్లంటే న‌మ్మ‌కం లేని వ్య‌క్తి. ఎంతో మంది అమ్మాయిలతో సంబంధం ఉంటుంది కానీ.. ప్రేమ‌లో మాత్రం ప‌డ‌డు. ఇద్ద‌రి మ‌ధ్య బంధానికి ఏదో ఒక పేరు ఉండాల్సిందేనా? అంటుంటాడు. అనుకోకుండా మాస్ క‌మ్యూనికేష‌న్ చదువుతున్న శ్రీల‌క్ష్మి (హెబ్బా ప‌టేల్‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. శ్రీల‌క్ష్మి అది ప్రేమే అంటుంది. ఆనంద్ మాత్రం ప్రేమ కాదంటాడు. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరుగుతుంది. ఆ త‌ర్వాత ఆనంద్ మ‌ళ్లీ శ్రీల‌క్ష్మిని క‌లిశాడా? లేదా? అత‌ని మ‌న‌సులో ప్రేమ ఎప్పుడు పుట్టింది? ప్రేమ పుట్టినా పెళ్లంటే న‌మ్మ‌కం లేని అత‌ని జీవితంలో ఎలాంటి గంద‌ర‌గోళం చోటు చేసుకుంది? అస‌లు పెళ్లంటే అత‌నికి న‌మ్మ‌కం లేక‌పోవ‌డానికి కార‌ణ‌మేంటి? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

నటీనటులు: అదిత్ అరుణ్, హెబ్బా ప‌టేల్‌ల న‌ట‌న బాగుంది. పాత్ర‌లకి త‌గ్గ‌ట్టుగా ప‌రిణ‌తితో న‌టించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. సినిమా ప్ర‌ధానంగా నాలుగు పాత్ర‌ల చుట్టూనే తిరుగుతుంది. రావు ర‌మేశ్‌ సైకో థెరపిస్ట్‌గా క‌థ‌ని న‌డిపించే పాత్ర‌లో క‌నిపిస్తారు. అదితి మ్యాక‌ల్ న‌వ‌త‌రం అమ్మాయిగా క‌నిపిస్తుంది. న‌రేశ్‌ క‌థానాయిక తండ్రిగా న‌ట‌న‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేని పాత్ర‌లో క‌నిపిస్తారు. సాంకేతికంగా సినిమా ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. జోయ్ బారువా స‌మ‌కూర్చిన పాట‌ల్లో రెండు మాత్రమే బాగున్నాయి. ఉద‌య్ గుర్రాల కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగానే ఉన్నాయి. ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్ క‌థకుడిగా, దర్శ‌కుడిగా విఫ‌ల‌మ‌య్యారు. త‌న మేధో సంపత్తినంతా ఉప‌యోగించి సినిమాని గంద‌ర‌గోళంగా మార్చేశారు. కొన్ని చోట్ల మాట‌లు ఆక‌ట్టుకుంటాయంతే.

6a 1

విశ్లేషణ: నేటిత‌రం మ‌ధ్య అల్లుకునే బంధాల నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. దాన్ని ద‌ర్శ‌కుడు 24 ముద్దుల‌తో ముడిపెట్టాడు. స్వ‌త‌హాగా చిన్న పిల్లల నేప‌థ్యంలో సాగే ఓ సినిమా తీసిన ఆయన తన ఆలోచ‌న‌ల్ని, స్వీయానుభా‌వాల్ని రంగ‌రించాడు. క‌థ‌లో ఎన్ని విష‌యాలు చెప్పినా సినిమాలో ఏదీ అత‌క్క‌పోగా… ఆద్యంతం గంద‌ర‌గోళంగా సాగుతుంది. ద‌ర్శ‌కుడు అస‌లు ఈ సినిమాతో ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నాడ‌నే విష‌యం ఒక ప‌ట్టాన ప్రేక్ష‌కుడికి అర్థం కాదు. ఒక సినిమా చూస్తున్న‌ప్ప‌డు అందులో హాస్య‌మో, భావోద్వేగాలో.. లేదంటే ఆస‌క్తో ఇలా ఏదో ఒక అనుభూతి క‌ల‌గాలి. కానీ ఈ సినిమా చూస్తున్నంత‌సేపు.. ఎంత‌సేపు ఈ సాగ‌దీత అనే అభిప్రాయం క‌లుగుతుంది త‌ప్ప ఏ ద‌శ‌లోనూ ఆక‌ట్టుకోదు. ఆనంద్ త‌న బాధ‌ని సైకో థెర‌పిస్ట్ అయిన మూర్తితో చెప్పుకోవ‌డంతో ఈ క‌థ మొద‌ల‌వుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య బంధానికి ప్రేమ‌, పెళ్లి అనే పేరు పెట్టాల్సిన అవ‌స‌రమే లేద‌నే ఆలోచ‌న‌లున్న హీరో… ప్రేమ‌పైనా, పెళ్లిపైనా న‌మ్మ‌క‌మున్న హీరోయిన్‌ మధ్య సంఘ‌ర్ష‌ణే ఈ సినిమా. ఇద్ద‌రూ శారీర‌కంగా ఒక్క‌ట‌య్యాక భిన్న అభిప్రాయాలున్న వాళ్లు ఎంత దూరం ప్ర‌యాణం చేశార‌నేది క‌థాంశం. దానికి ద‌ర్శ‌కుడు త‌న‌దైన క‌వితాత్మ‌క‌త‌ని జోడించే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే ఆ క‌థ‌నం ఒక ప‌ట్టాన అర్థం కాదు. చివ‌రికి ప్రేమ‌ని రుచి చూశాన‌న్న హీరో మ‌ళ్లీ పెళ్లి ద‌గ్గ‌రికొచ్చేస‌రికి న‌మ్మ‌కం లేదంటాడు. దాంతో అక్క‌డ పెళ్లెందుకు ఇష్టం లేద‌ని మ‌రో క‌థ ఉంటుంది. ఆ స్టోరీ అంతా సాగ‌దీత‌గా అనిపిస్తుంది త‌ప్ప వినోదం కానీ, భావోద్వేగాలు కానీ పంచ‌దు.

6b

హైలైట్స్
హీరో, హీరోయిన్‌ నటన

డ్రాబ్యాక్స్
సాగ‌దీత‌గా అనిపించే స‌న్నివేశాలు

చివరిగా : హెబ్బా ’24 కిస్సెస్‌’ తెరపై తేలిపోయాయి.
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

టైటిల్ : 24 కిస్సెస్‌
నటీనటులు : అరుణ్ అదిత్, హెబ్బా పటేల్, రావు ర‌మేశ్‌‌, ర‌వివ‌ర్మ, అదితి మ్యాక‌ల్ త‌దిత‌రులు.
సంగీతం : జోయ్ బారువా
దర్శకత్వం : అయోధ్య‌కుమార్ కృష్ణంశెట్టి
నిర్మాత : స‌ంజ‌య్ రెడ్డి, అనిల్ ప‌ల్లాల‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu

టాలీవుడ్‌లో 'అర్జున్‌రెడ్డి', 'ఆర్‌.ఎక్స్‌.100' సినిమాతో ముద్దు స‌న్నివేశాల‌కి హ‌ద్దులు చెరిగిపోయాయి. అయితే వాటిలో కేవ‌లం ముద్దులే కాదు.. అందుకు త‌గ్గ కథ కూడా ఉంది కాబ‌ట్టే విజ‌యం సాధించాయి. ఆ సినిమాల తర్వాత ప్ర‌చార ప‌రంగా మాత్రం ద‌ర్శ‌క‌ నిర్మాత‌ల‌కి కొత్త దారులు తెర‌చుకున్నట్లైంది. ముద్దుల్నే ఎర‌గా వేసి ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అలా పేరులోనే ముద్దులున్న '24 కిస్సెస్‌' ప్ర‌చార...24 కిస్సెస్‌ మూవీ రివ్యూ