బాలయ్య స్టయిల్ మార్చవా..?

ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆ కుటుంబం నుండి వారసులుగా వచ్చిన ఎన్టీఆర్ వంటి హీరోలు స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చే విషయంలో దూసుకుపోతుంటే బాలయ్య మాత్రం ఇప్పటికీ స్పీచ్ ఇచ్చే విషయంలో తడబడుతున్నాడు. నటుడిగా నలభై ఏళ్ల ప్రయాణం చేసిన బాలయ్య వంద సినిమాల మార్క్ ను చేరుకున్నారు. సినిమాలో ఆయన డైలాగ్ చెబుతుంటే అభిమానులు ఈలల గోల తప్పనిసరి. కానీ స్టేజ్ మీద మాత్రం మైక్ పట్టుకుంటే ఆఖరికి ఆయన అభిమానులు కూడా విసిగిపోతున్నారు.

ఆయన మాట్లాడే విషయం పట్ల స్పష్టత ఉండడం లేదు. సంస్కృతం, పురాణాలు ఇలా ప్రతి విషయంలో బాలయ్యకు ఎవరు సాటిరారు. కానీ చెప్పే విషయాన్ని అర్ధమయ్యే విధంగా చెప్పాలి కదా..? ఒక టాపిక్ ను మొదలుపెడితే అది ఎక్కడకి వెళ్ళి ఆగుతుందో.. చెప్పలేని పరిస్థితి. ఆయన ప్రసంగం మొదలుపెడితే తరువాత ఏం చెప్పబోతున్నారో.. అభిమానులు, పాత్రికేయులు ఊహించగలుగుతున్నారు. దీంతో ఆయన స్పీచ్ అంటే రాను రాను అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోతుంది. ఇకనైనా సభకి వెళ్ళే ముందు కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్తే మంచిది!