‘అదుగో’ ట్రైలర్‌

నటుడు రవిబాబు దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం ‘అదుగో’. ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్, ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో పందిపిల్ల ముఖ్య పాత్ర పోషించడం విశేషం. ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో ‘బంటి’ అనే పందిపిల్ల చేసే అల్లరి, యాక్షన్‌ ఘట్టాలను పరిచయం చేశారు. అందరూ దీని వెనకే పడుతుంటారు. వారి నుంచి తప్పించుకోవడానికి బంటి చేసే విన్యాసాలు నవ్వులు పూయిస్తున్నాయి.

బంటిని దాని తల్లి తిడుతూ..’రేయ్‌ పంది..ఒక్కసారి చెబితే అర్థంకాదా? మనుషుల్లా మళ్లీ మళ్లీ చెప్పించుకుంటావా? వెనక్కి రా..’ అని తిట్టడం ఫన్నీగా ఉంది. బంటీ చేసే మూన్‌ వాక్‌ స్టెప్‌ హైలైట్‌గా నిలిచింది. ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో ఏ సినిమా కూడా రాలేదు. దాంతో ప్రేక్షకులకూ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

‘అదుగో’ చిత్రాన్ని భారతదేశంలోని వివిధ భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు దర్శక, నిర్మాతలు ప్రకటించారు. దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారి పూర్తిస్థాయి లైవ్ యాక్ష‌న్ 3డి యానిమేష‌న్‌ సినిమాగా పేర్కొన్నారు. అందుకే ఈ చిత్రాన్ని వీలైన‌న్ని భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నట్లు తెలిపారు. తెలుగులో ‘అదుగో’ టైటిల్‌తో రానున్న ఈ చిత్రం.. మిగిలిన భాష‌ల్లో మాత్రం ‘బంటి’ పేరుతో విడుద‌ల కాబోతోందని వెల్లడించారు.