‘హ్యాపీ బర్త్‌ డే మై బేబీ’ అభిషేక్‌కు ఐశ్వర్య విషెస్‌


బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ నేడు 43వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతడి సతీమణి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఫొటో అభిమానులను ఆకర్షిస్తోంది. అభిషేక్‌ చిన్ననాటి ఫొటోను షేర్‌ చేసిన ఐశ్వర్య.. ‘హ్యాపీ బర్త్‌ డే మై బేబీ’ అంటూ క్యాప్షన్‌ జత చేశారు. పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే మూడున్నర లక్షలకు పైగా లైకులు రావడంతో పాటు అభిషేక్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అభిషేక్‌ సోదరి శ్వేతా నందా కూడా అభిషేక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్లిద్దరి చిన్ననాటి ఫొటో షేర్‌ చేశారు.

కాగా బిగ్‌ బీ అమితాబ్‌- జయా బచ్చన్‌ల కుమారుడైన అభిషేక్‌ ‘రెఫ్యూజీ’ సినిమాతో 2000వ సంవత్సరంలో తెరంగేట్రం చేశాడు. హీరోగా కొనసాగుతూనే సపోర్టింగ్‌ రోల్స్‌తో ఆకట్టుకునే అభిషేక్‌.. వ్యాపార రంగంలోనూ సత్తా చాటుతున్నాడు. ప్రో కబడ్డీ లీగ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ జట్టు యజమానిగా, ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లో చెన్నైయాన్‌ ఎఫ్‌సీ జట్టు సహయజమానిగా కొనసాగుతున్నాడు. ఇక అభిషేక్‌ బచ్చన్ 2007లో ఐశ్వర్య రాయ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరికి ఆరాధ్య అనే కూతురు ఉంది.