వందో సినిమా కోసం నాగ్ ప్లాన్!

అక్కినేని నాగార్జున తన వందో సినిమా ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. నిజానికి నాగార్జున వంద సినిమాలు పూర్తి కాలేదు కానీ గెస్ట్ రోల్స్ అన్నీ కలుపుకుంటే మాత్రం వందకు దగ్గరవుతాయి. నాగార్జున ఈ విషయంపై అంత ఆసక్తి లేకున్నా.. ఆయన అభిమానులు మాత్రం వందో సినిమా ఎప్పటికీ గుర్తుండిపోవాలని నాగ్ పై ఒత్తిడి తీసుకు వస్తున్నారట. దీంతో వందో సినిమా ఎలా ఉండాలనే విషయంలో నాగ్ ఇప్పటికే క్లారిటీకి వచ్చేశాడట. తన పాత్ర బంగార్రాజు క్యారెక్టర్ మాదిరి ఉండాలని కొందరు దర్శకులను పిలిచి చెప్పారట.

అంతేకాదు కథలో నాగచైతన్య, అఖిల్ లకు మంచి పాత్రలు రాయాలని చెప్పారట. వీలైతే అమల కోసం కూడా ఓ రోల్ క్రియేట్ చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి తన వందో సినిమా అక్కినేని అభిమానులకు కనువిందు చేసే విధంగా ఉండాలని నాగ్ లెక్కలు వేస్తున్నాడు. అయితే ఈలోగా రాజుగారిగది2, అలానే చందు మొండేటి డైరెక్షన్ లో మరో సినిమా చేయాల్సివుంది. దిల్ రాజు కూడా నాగ్ తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.