క్రిష్ ‘ఖిలాడీ’?

దర్శకుడు క్రిష్‌, బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ కాంబినేషన్‌లో సినిమా రాబోతోందా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ‘ఎన్‌.టి.ఆర్‌’ తర్వాత క్రిష్‌ తర్వాతి సినిమాను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో కొత్త సినిమాపై వదంతులు వస్తున్నాయి. ‘ఖిలాడీ’ హీరోగా సినిమా తీసేందుకు క్రిష్‌ సన్నాహాలు చేస్తున్నారని చెబుతున్నారు. ‘ఇప్పటికే అక్షయ్‌కు క్రిష్‌ కథ నరేట్‌ చేశారు. అన్నీ కుదిరాక త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు’ అని సన్నిహిత వర్గాలు చెప్పినట్లు ఓ ఆంగ్లపత్రిక పేర్కొంది. మరి ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇప్పటికే అక్షయ్‌, క్రిష్‌ కాంబినేషన్‌లో ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’ సినిమా వచ్చింది. ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది.

అక్షయ్‌ ఇటీవల ‘కేసరి’ తో హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘మిషన్‌ మంగళ్‌’, ‘హౌస్‌ఫుల్‌ 4’, ‘గుడ్‌న్యూస్‌’, ‘లక్ష్మీబాంబ్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘కాంచన’కు హిందీ రీమేక్‌గా ‘లక్ష్మీబాంబ్‌’ తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. రాఘవా లారెన్స్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వాణీ హీరోయిన్‌.

CLICK HERE!! For the aha Latest Updates