‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ కోసం తెలుగు నేర్చుకుంటున్న ఆలియా భట్!

బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్ .. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడే దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నానని అంటున్నారు. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రంలో ఆలియా హీరోయిన్‌గా నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా ఆమె నటిస్తారు. ఈ నేపథ్యంలో తెలుగు నేర్చుకోవడానికి ఆలియా ట్యూటర్‌ను నియమించుకున్నారు. ఈ విషయం గురించి ఆలియా ఓ మీడియా వర్గం ద్వారా మాట్లాడుతూ.. ‘తెలుగు నేర్చుకోవడం నాకో ఛాలెంజ్‌ అనే చెప్పాలి. భాష నేర్చుకోవడం చాలా కఠినంగా ఉంది. కానీ అన్ని భావాలను పండించగలిగే చక్కని భాష ఇది. ఆ పదాన్ని అలా ఎందుకు పలుకుతారు? ఇలా ఎందుకు అంటారు?వాటి అర్థమేంటి?వంటి విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడే నా పాత్రకు పూర్తి న్యాయం చేయగలను. ఈ సినిమాను ఒప్పుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడే ముగ్గురు దర్శకులతో తప్పకుండా పనిచేయాలని నిర్ణయించుకున్నాను. వారిలో కరణ్‌ జోహార్, సంజయ్‌ లీలా భన్సాలీ, రాజమౌళి ఉన్నారు. కరణ్‌ నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు భన్సాలీ, రాజమౌళి సర్‌లతో పనిచేస్తున్నాను’ అని వెల్లడించారు ఆలియా.
ఈ చిత్రంలో చరణ్‌ అల్లూరి సీతారామ రాజు పాత్రలో, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. తారక్‌కు జోడీగా డైసీ ఎడ్గార్‌జోన్స్‌ నటించాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల ఆమె సినిమా నుంచి తప్పుకొన్నారు. మరి ఆమె పాత్ర ఎవరికి దక్కనుందో వేచి చూడాలి. 2020 జులై 30 ‘ఆర్‌ ఆర్ ఆర్‌’ అన్ని భారతీయ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.