HomeTelugu Big Stories'నాంది' మూవీ రివ్యూ

‘నాంది’ మూవీ రివ్యూ

Naandi movie review
అల్లరి నరేష్‌ నటించిన తాజా చిత్రం ‘నాంది’. ఈ రోజు శుక్రవారం (ఫిబ్రవరి 19) ఈ సినిమా విడులైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపైఅంచనాలు పెంచేశాయి. ఈ సినిమాలో అల్లరి నరేశ్ నగ్నంగా నటించడం, సీరియస్ రోల్ నటిస్తున్నాడు. ఈ సినిమాపై నరేష్‌ కూడా ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. మరి నరేష్‌ ప్రయోగం ఫలించి విజయం సాధించాడా? అల్లరి నరేష్‌ 57వ సినిమాగా రిలీజ్‌ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం..

కథ: (అల్లరి నరేశ్‌) సూర్య‌ ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. తల్లిదండ్రులు అంటే అతనికి ఎనలేని ప్రేమ. తనను చదువించడం కోసం తల్లిదండ్రులు పడిన కష్టాలు చూసిన సూర్య ఉద్యోగం వచ్చాక వారిని సంతోషంగా చూసుకుంటాడు. ఇక తన తల్లిదండ్రులు సూర్యకు ఉద్యోగం రావడంతో పెళ్లి చేయాలని నిర్ణయించుకొని అమ్మాయిని కూడా చూస్తారు. ఇలా కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న సూర్యప్రకాశ్‌ అనుకోకుండా పౌరహక్కుల నేత రాజగోపాల్‌ హత్యకేసులో అరెస్ట్‌ అవుతాడు. చేయని నేరాన్ని తనపై వేసి సూర్యని హింసిస్తాడు ఏసీపీ కిషోర్‌ (హరీష్‌ ఉత్తమన్). తప్పడు కేసులు పెట్టి ఐదేళ్ల పాటు సూర్యని బయటకు రాకుండా చేస్తాడు. ఈ క్రమంలో జూనియర్‌ లయర్‌ ఆద్య (వరలక్ష్మీ శరత్‌ కుమార్) ఈ కేసును టేకప్‌ చేసి సూర్యని నిర్థోషిగా బయటకు తీసుకువస్తుంది. బయటకు వచ్చిన సూర్య తనకు జరిగిన అన్యాయంపై ఏరకంగా పోరాడాడు? అసలు పౌరహక్కుల నేతను ఎవరు,ఎందుకు చంపారు? ఈ కేసులో సూర్యని ఎందుకు ఇరికించారు? జైలులో ఉన్న సూర్యకి, లాయర్‌ ఆద్య మధ్య ఉన్న సంబంధం ఏంటి? సూర్యకు జరిగిన అన్యాయంపై లాయర్‌ ఆద్య ఏరకంగా పోరాటం చేసిందనేదే కథలోని అంశం.

నటీనటులు: ఇప్పటి వరుకు కేవలం కామెడీ చేస్తూ వచ్చిన అల్లరి నరేష్‌ తొలిసారిగా ఇలాంటి డిఫెరెంట్‌ పాత్రను చేశాడు. సూర్య అనే మిడిల్‌ క్లాస్‌ యువకుడి గా నరేష్‌ జీవించేశాడు. ప్రతిసన్నివేశాన్ని ప్రాణంపెట్టి చేశాడు. సినిమా మొత్తాన్ని తన భుజస్కందాలపై నడిపించారు. వరలక్ష్మీ శరత్‌ కుమార్ లయర్‌ పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమాకు నరేశ్‌ పాత్ర ఎంత ముఖ్యమో..వరలక్ష్మీ పాత్ర కూడా అంతే. తన అద్భతమైన నటనతో ఈ సినిమాను మరోలెవల్‌కి తీసుకెళ్లింది. ఏసీపీ కిషోర్‌ అనే నెగెటివ్‌ పాత్రలో హరీష్‌ ఉత్తమన్ మెప్పించారు. ప్రవీన్‌, ప్రియదర్శి, శ్రీకాంత్‌ అయ్యంగార్, దేవీ ప్రసాద్‌, వినయ్‌ వర్మ తమ పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ: ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 211కు సంబంధించిన కథే ‘నాంది’ సినిమా. తొలి సినిమాతోనే ఓ మంచి సందేశాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించిన దర్శకుడు విజయ్ కనకమేడలను కచ్చితంగా అభినందించాల్సిందే. ఆయన కథ,కథనాలు సినిమాకు ఊపిరిపోశాయి. క్లిష్టమైన అంశాన్ని సాధారణ ప్రేక్షకుడి అర్థమయ్యేలా తెరపై చూపించడంలో
దర్శకుడు సఫలం అయ్యాడు. పోలీసు ఇన్వెస్టిగేషన్ తీరు, న్యాయవ్యవస్థలోని అంశాలు, న్యాయాన్ని రాజకీయ నాయకులు ఎలా భ్రస్టు పట్టిస్తున్నారనే అంశాలను ఎక్కడా లోపాలు లేకుండా చక్కగా తెరపై చూపించాడు. కొన్ని డైలాగ్స్‌ గుండెల్ని హత్తుకున్నాయి. ప్రీక్లైమాక్స్‌లోని కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. నరేష్‌ కెరియర్‌లో ‘నాంది’ అద్భతమైన చిత్రంగా నిలిచిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

టైటిల్: నాంది
న‌టీన‌టులు: అల్లరి నరేశ్,వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ప్రవీన్‌, ప్రియదర్శి తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: విజయ్ కనకమేడల
నిర్మాత‌లు: సతీష్ వేగేశ్న
సంగీతం:శ్రీచరణ్‌ పాకల

హైలైట్స్: కథ, అల్లరి నరేష్‌, వరలక్ష్మి నటన

డ్రాబ్యాక్స్: పాటలు

చివరిగా: ‘నాంది’ అల్లరి నరేష్‌ చిత్రంలో నిల్చిపోతుంది

(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu