చైతు,సమంత కాంబినేషన్ లో సినిమా!

పెళ్ళైన తరువాత చాలా మంది హీరోయిన్లు నటనకు దూరంగా ఉంటారు. కానీ నటి సమంత మాత్రం వివాహానికి, నటనకు ఏమాత్రం సంబంధం లేదని ఇదివరకే ప్రకటించింది. పెళ్లి తరువాత కూడా సమంత నటిస్తుందని చైతు కూడా వెల్లడించారు. ప్రస్తుతం చైతు, సమంతలు తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. అక్టోబర్ లో వీరిద్దరి వివాహం జరగబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే చైతు, సమంతలకు పెళ్లి అనుకున్న దగ్గర నుండి వారి కాంబినేషన్ లో సినిమా వస్తే బావుంటుందని అభిమానులు ఆశించారు. నిజానికి ‘రా రండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో కూడా సమంత నటించాల్సివుంది కానీ వారి క్రేజ్ ను క్యాష్ చేసుకున్నారనే కామెంట్స్ వినిపిస్తాయని సమంత తప్పుకుంది. 
ఈ క్రమంలో పెళ్ళైన తరువాత వీరిద్దరు కలిసి నటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అక్టోబర్ లో చైతు, సమంతల పెళ్లి అయిన తరువాత నవంబర్ లో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తలిద్దరూ హీరోహీరోయిన్లుగా కలిసి నటించనుండం ఒక విధంగా అరుదైన విషయమే. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుందట. ప్రస్తుతం ‘మహానుభావుడు’ చిత్రంతో బిజీగా ఉన్న మారుతి ఆ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనుకుంటున్నాడు. దాని తరువాత చైతు, సమంతల సినిమాను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు.