‘ఏబీసీడీ’ ఫ్లాప్ పై హుందాగా స్పందించిన అల్లు శిరీష్‌

నటుడు అల్లు శిరీష్‌ పుట్టినరోజు నేడు. అల్లు రామలింగయ్య మనవడిగా, స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ తమ్ముడిగా వెండితెరకు పరిచయం అయిన శిరీష్, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. రొటీన్‌ ఫార్ములా కథలను కాకుండా డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు శిరీష్‌. ఈ ట్వీట్‌లో శిరీష్ స్పందించిన తీరు అం‍దరినీ ఆకట్టుకుంటోంది.

ఇటీవల ఏబీసీడీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శిరీష్. మలయాళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించిన శిరీష్ ప్రేక్షకుల తీర్పును గౌరవిస్తానన్నాడు. ‘మేమంతా మీకు మంచి సినిమా అందించేందుకు చాలా కష్టపడ్డాం. కానీ అంచనాలను అందుకోలేకపోయాం’ అంటూ ట్వీట్ చేశారు. ఫ్లాప్ సినిమాలకు కూడా సక్సెస్‌మీట్‌లు పెట్టి హడావిడి చేస్తున్న తరుణంలో శిరీష్‌ స్పందించిన తీరు హుందాగా ఉందంటున్నారు విశ్లేషకులు.