పుల్వామా ఉగ్రదాడిపై అనసూయ ట్వీట్‌.. నెటిజన్స్ ఆగ్రహం

పుల్వామా ఉగ్రదాడిపై అనసూయ చేసిన ఓ పోస్ట్‌పై ఆమె ఫాలోవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడిపై సంతాపం వ్యక్తం చేయని నువ్వు.. బాధని, ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నవారిని కించపరుస్తావా అంటూ మండిపడుతున్నారు. కొంతమంది వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు. వాస్తవానికి అనసూయ ఓ అమర జవాను కుమార్తె పోస్టు ద్వారా మంచి విషయాన్నే చెప్పాలనుకుంది. కానీ, అది మిస్‌ ఫైర్ అయ్యింది.

పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత సోషల్ మీడియాలో చాలామంది పాకిస్థాన్‌పై యుద్ధం చేయాలని, సర్జికల్ దాడులు చేయాలని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని పోస్టులు ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అంటూ భావోద్వేగాలను రెచ్చగొడుతున్నాయి. ఈ నేపథ్యంలో అనసూయ.. ప్రతీకారం కాదు, నిజంగా ఆ బాధను ఎదుర్కొంటున్న వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తున్నారో చూడండనే అర్థం వచ్చేలా తన ఫేస్‌బుక్ పేజీలో ఓ పోస్ట్ పెట్టింది.

‘నిజంగా ఆ బాధను అనుభవించిన వ్యక్తులకు, కేవలం అరిచే (Noice) వ్యక్తులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇది చూపిస్తోంది’ అంటూ అనసూయ.. అమర జవాను లెఫ్టినెంట్ జనరల్ గౌతమ్ రవింద్రనాథ్ కుమార్తె మానసి స్కాట్ చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్‌ను అనసూయ షేర్ చేసింది. ఇందులో సోషల్ మీడియాలో ప్రతీకారం తీర్చుకుందామని వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తులను ఉద్దేశిస్తూ.. మానసి తన తల్లి చెప్పిన మాటలను పోస్ట్ చేసింది.

‘సోషల్ మీడియాలో ప్రతీకారం తీర్చుకుందామని ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే.. అక్కడ పోరాడి, మీ కోసం ప్రాణాలు అర్పించేది మీరు కాదు కాబట్టి. మీరు రోడ్లపైనే మూత్రం పోస్తారు, ఉమ్ములు వేస్తారు, రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తారు, ఘోరంగా డ్రైవింగ్ చేస్తారు, అమ్మాయి, మహిళలపై అరుస్తారు. కులం, మతం, ప్రాంతాల వారీగా విడిపోయి ద్వేషించుకుంటారు. ఎన్నికల్లో నేరగాళ్లకు ఓటేస్తారు. మీరు చెబుతున్న ‘ప్రతీకారం’ విలువ తెలుసుకోండి. లేదా మీరే వెళ్లి ప్రతీకారం తీర్చుకోండి. అక్కడ (సరిహద్దుల్లో) తమ కుటుంబాలను వదులకుని డ్యూటీ చేస్తున్నవారికి బాధ్యతలను గుర్తుచేయాల్సిన అవసరం లేదు’ అని మానసి తల్లి పేర్కొన్నారు.

ఈ పోస్టు చేసిన అనసూయ తన సొంత వ్యాఖ్యలను కాకుండా.. మానసికి రిప్లై ఇచ్చిన ప్రియాంక అనే యువతి వ్యాఖ్యలను తన ఫేస్‌బుక్‌లో కాపీ-పేస్ట్ చేసింది. దీంతో కొందరు అనసూయను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై అనసూయ లైవ్ చాటింగ్ ద్వారా స్పందించింది. ఆ పోస్టులో విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని మాట్లాడాలని పేర్కొంది.

CLICK HERE!! For the aha Latest Updates