‘అనసూయా.. సావిత్రి గారితో నీకు పోలికా’ నెటిజన్లు ఫైర్‌..

‘క్లాసిక్‌ను ఎప్పటికి టచ్‌ చేయకూడదు.. మాస్టర్‌ పీస్‌ని చెడగొట్టకూడదు’ ఇది సినిమా ఇండస్ట్రీలో మొదటి నియమం. ఫెయిల్యూర్‌ అవుతుందనే భయం కన్నా ఫీల్‌ చెడితే జనాల నుంచి వచ్చే వ్యతిరేకతను ఎదుర్కొవడం అంత సులువు కాదు. ఇంతకు ముందంటే మన సినిమాల గురించి జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు పెద్దగా అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు సోషల్‌ మీడియా వల్ల తమకు నచ్చని వాటి గురించి మొహం మీదే చెప్పేస్తున్నారు అభిమానులు. నచ్చితే పొగడటం.. లేదంటే​ ట్రోల్‌ చేయడం వెంటవెంటనే జరిగిపోతుంది. ప్రస్తుతం నెటిజన్ల ఆగ్రహానికే కాక మహానటి సావిత్రి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు టాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ యాంకర్‌, నటి అనసూయ.

ఓ వైపు టీవీ షోలు.. అడపదడపా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తోన్న అనసూయ తాజగా ప్రకటనల రంగంలోకి కూడా ప్రవేశించారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ వస్త్రాల కంపెనీ యాడ్‌లో నటించిన అనసూయపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాడ్‌ కోసం సదరు కంపెనీ ఎవర్‌ గ్రీన్‌ హిట్‌ ‘మాయాబజార్‌’ సినిమాలోని ‘ఆహా నా పెళ్లంట’ పాటను ఎంచుకున్నారు. ఈ పాటలో అనసూయ ఏకంగా మహానటి సావిత్రిని ఇమిటేట్‌ చేస్తూ నటించారు. దాంతో నెటిజన్లు అనసూయనే కాక సదరు మాల్‌ యాజమాన్యాన్ని కూడా తెగ ట్రోల్‌ చేస్తున్నారు. ‘మీరు సావిత్రి గారిని అవమానించారు’. ‘అనసూయా.. సావిత్రి గారితో నీకు పోలికా’.. ‘దయ చేసి సావిత్రమ్మని ఇలాంటి పనులకు ఉపయోగించుకోకండి’.. అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఈ యాడ్‌లో ఘటోత్కచుడి పాత్రలో యస్వీఆర్‌ను ఇమిటేట్‌ చేస్తూ ప్రముఖ గాయకుడు మనో నటించారు.