తమిళ నటుడితో ‘స్వీటీ’

ప్రముఖ నటి అనుష్క నుంచి ‘భాగమతి’ తర్వాత మరో కొత్త సినిమా ప్రకటన ఏదీ రాలేదు. దీంతో ఆమె తర్వాతి సినిమా ఏంటని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే బుధవారం అనుష్క పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె తదుపరి సినిమాకు సంబంధించిన వివరాలను ప్రముఖ రచయిత కోన వెంకట్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. కోన వెంకట్‌ అందించిన కథలో అనుష్క నటించనున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ముందు నుంచీ వార్తలు వెలువడుతున్నట్లే ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మాధవన్, అనుష్క జంటగా నటించనున్నారు.

2019లో అమెరికాలో చిత్రీకరణ మొదలుకానున్నట్లు కోన వెంకట్‌ ప్రకటించారు. సుబ్బరాజు కీలక పాత్ర పోషించనున్నారు. ‘వస్తాడు నా రాజు’ ఫేం హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించనున్నారు. మాధవన్‌, అనుష్క కాంబినేషన్‌లో ‘రేండు’ అనే సినిమా వచ్చింది. 2006లో వచ్చిన ఈ తమిళ సినిమాకు సి.సుందర్‌ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం అనుష్క బరువు తగ్గే పనిలో ఉన్నారు. ఇందుకోసం ఆమె విదేశాల్లో నేచురల్‌ థెరపీలను తీసుకుంటున్నారట.