చట్టసభలపై నమ్మకం కలిగించాలనే సీతారామ్‌ను ఎంచుకున్నాం: జగన్‌

ఏపీ శాసనసభ సభాపతిగా నియమితులైన తమ్మినేని సీతారామ్‌కు ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా సభలో సీఎం మాట్లాడుతూ.. ‘సౌమ్యూడైన తమ్మినేని శాసనసభకు ఆరుసార్లు ఎన్నికై మంచిపేరు తెచ్చుకున్నారు. చట్టసభలపై మళ్లీ నమ్మకం కలిగించాలనే సీతారామ్‌ను ఎంచుకున్నాం. వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఆలోచించి స్పీకర్‌ ఎంపికపై నిర్ణయం తీసుకున్నాం.’

‘శాసనసభలో విలువలు లేని రాజకీయాలు చూశాం. ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనీయని సందర్భాలు చూశాం. పార్టీ కండువాలు మార్చించి మంత్రిపదవులు ఇచ్చిన వైనాన్ని చూశాం. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని తుంగలోకి తొక్కి సభ ప్రతిష్ఠను ఎలా దిగజార్చారో చూశాం. చివరకు స్పీకర్‌పై అవిశ్వాసానికి ఉన్న నిబంధనను అప్పటికప్పుడు మార్చడం చూశాం. నేను కూడా అలాంటి అన్యాయమైన సంప్రదాయం పాటిస్తే మంచి ఎక్కడా బతకదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అన్ని గుణాలు సీతారామ్‌లో సంపూర్ణంగా ఉన్నాయని నమ్ముతున్నా’ అని సీఎం తెలిపారు.