న్యూయార్క్ లో ఏపీ సీఎం చంద్రబాబు

అమెరికాలో తెలుగువారు అద్భుతంగా రాణిస్తున్నారని.. వారు తమ శక్తి సామర్థ్యాలను ఎంతోకొంత సొంత రాష్ట్రానికి వినియోగించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని అన్నారు. అమెరికాలో ఉండే ప్రతి ఒక్కరూ సొంత ప్రాంతానికి ఏం చేయగలను అని ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ మరింత ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు. ప్రవాసులు సొంత ఊరిలో పెట్టుబడి పెట్టి.. ఆ ఊరి అభివృద్ధికి దోహదపడవచ్చని సూచించారు. ఇందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అమరావతి నిర్మాణంలో ప్రవాసాంధ్రుల పాత్ర ఉండాలని అభిలాషించారు. ప్రపంచంలో అనేక పెద్దపెద్ద కంపెనీలు తాము సంపాదించిన డబ్బును తిరిగి ఛారిటీల ద్వారా ఖర్చు పెడుతున్నాయని.. ప్రవాసాంధ్రులు కూడా అదే బాటలో నడవాలని సూచించారు. అమెరికాలోని  న్యూయార్క్ వేదికగా మన్నవ మోహనకృష్ణ, కలపటపు బుచ్చి రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలో ఎన్ఆర్ఐ టీడీపీను ప్రారంభిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.

ప్రవాస భారతీయులందరికీ ఓటు హక్కు రాబోతోంది. దీన్ని అంతా వినియోగించుకుని టీడీపీను గెలిపించాలి. రాష్ట్రంలో మళ్లీ మీరే అధికారంలోకి రావాలని నేడు అంతా కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీపైనా అభిమానం ఉండే ప్రతిఒక్క వ్యక్తి రియల్ టైంలో టీడీపీ ఎన్ఆర్‌ఐ విభాగం‌లో చేరాల్సిన అవసరం ఉంది. దీంతో మీకు ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం వస్తుంది. జ్యూయిష్ వర్గం లాగా తెలుగువారు కూడా ఆర్థికంగా అభివృద్ధి పథంలో సాగాలి అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

ఏపీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో రియల్ టైమ్ గవర్నెన్స్ విధానం ద్వారా పాలనలో నూతన సాంకేతికతను తీసుకొచ్చి.. ప్రజలకు పాలన మరింత చేరువ చేయగలిగాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉన్నాం. ప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేకంగా బీమా పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. అని వివరించారు. ఇటీవలే అమెరికాలో లోకేశ్‌ ఆధ్వర్యంలో టీడీపీ మహానాడు బ్రహ్మాండంగా నిర్వహించారని.. అదే స్పూర్తిని ఇకపై కూడా కొనసాగించాలని కోరారు.

ఎన్‌జేఐటీ వెల్‌నెస్‌, ఈవెంట్స్ కేంద్రంలో జరిగిన ఈ మీట్ & గ్రీట్ సమావేశానికి 4 వేల మంది తరలి వచ్చారు. మావోల దాడిలో మృతిచెందిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణ కు తొలుత మౌనం పాటించారు. అనంతరం, జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ చేశారు.

అంతకుముందు అమెరికాలో ప్రవాసాంధ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. న్యూయార్క్ జేఎఫ్‌కె ఎయిర్ పోర్టుకు చంద్రబాబు చేరుకుంటున్నారనే సమాచారంతోనే వందలమంది తెలుగు వారు ఆ విమానాశ్రయానికి చేరుకున్నారు. నాట్స్ డైరెక్టర్ మన్నవ మోహనకృష్ణ, కలపటపు బుచ్చి రామ్ ప్రసాద్, డా.రవి వేమూరి, కోమటి జయరాం, సతీష్ వేమన, జై తాళ్లూరి తదితరులు చంద్రబాబుకు పుష్పగుచ్చాలు ఇచ్చి సాదర స్వాగతం పలికారు. చంద్రబాబు తో సెల్ఫీలు దిగేందుకు ప్రవాస భారతీయులు పోటీపడ్డారని తెలుగుదేశం పార్టీ జాతీయ మీడియా కమిటీ కన్వీనర్ యల్.వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ తెలిపారు