ఏపీలో జలసిరికి హారతిచ్చిన చంద్రబాబు

కర్నూలు జిల్లాలో జలసిరికి హారతి కార్యక్రమం నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర జలసిరికి హారతినిచ్చారు. అంతకు ముందు శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. సున్నిపెంట వద్ద పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏపీలో అందరికీ నీటి భద్రత ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. దీనికోసం వంశధార-నాగావళి నదులను అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేస్తామని ప్రజల్లో చైతన్యం తేవడానికే జలసిరికి హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా సెప్టెంబర్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో చిన్నా పెద్దా కలిపి 35 నదులు ఉన్నాయి. కృష్ణా నదిపై నాగార్జున సాగర్‌ తర్వాత శ్రీశైలం జలాశయం నిర్మితమైంది. రాయలసీమలో నీళ్ల కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఈ ప్రాంతానికి నీళ్లివ్వాలని మొదట నిర్ణయించింది ఎన్టీఆరేనని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు రాష్ట్రంగా మారేందుకు అనేక చర్యలు చేపట్టాం. ప్రతి ఒక్క రైతుకూ నీరిచ్చేంత వరకు నేను జలదీక్ష విరమించనని చంద్రబాబు అన్నారు. ఏ రాజకీయ పార్టీ వల్ల ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చిందో, ఎవరివల్ల మీకు లాభం వచ్చిందో అని ఆలోచించి ప్రజలు పూర్తిగా సహకరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.