విజయవాడ చేరుకున్న హైకోర్టు ఉద్యోగులు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అధ్యాయం నేటితో ముగియనుంది. జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా పనిచేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ న్యాయవాదులు, సిబ్బందికి తెలంగాణ న్యాయవాదులు, సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. రేపటి నుంచి అమరావతి నుంచే ఆ రాష్ట్ర హైకోర్టు పనిచేయనుంది. ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి అమరావతికి 900 మంది ఉద్యోగులు తరలివెళ్తున్నారు. బస్సుల్లో వీరంతా అమరావతికి బయలుదేరారు.

అమరావతికి చేరిన ఉద్యోగులంతా విజయవాడకు చేరుకున్నారు. వీరికి జిల్లా న్యాయమూర్తి, పోలీస్ కమిషనర్ లు స్వాగతం పలికారు. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ గార్డ్ ఆఫ్ హనర్ అందుకున్నారు. రాత్రి 7 గంటలకు దుర్గమ్మ దర్శనానికి న్యాయమూర్తులు వెళ్లనున్నారు. ఈ రోజు నోవాటెల్ హోటల్ లో న్యాయమూర్తులు బస చేస్తారు. రేపు ఉదయం ఇందిరా గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతి పరిధిలో నిర్మిస్తున్న హైకోర్టు భవనం పూర్తయ్యే వరకు హైదరాబాద్‌ నుంచి హైకోర్టు తరలింపు నిర్ణయం వాయిదా వేయాలని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం వేసిన రిట్‌ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టలేమని ఈ ఉదయం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించినప్పటికీ.. అత్యవసర విచారణ చేపట్టలేమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ స్పష్టం చేశారు. జనవరి 2న సాధారణ విచారణ చేపడతామని తెలిపారు.