జగన్‌పై హత్యాయత్నం

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఆయనపై ఓ దుండగుడు దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి వైఎస్‌ జగన్‌పై దుండగుడు దాడి చేశాడు. కోడి పందెలకు ఉపయోగించే కత్తితో అతను దాడికి తెగబడ్డాడు. దీంతో వైఎస్‌ జగన్‌ భుజానికి తీవ్రగాయమైంది. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ క్యాంటీన్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌గా గుర్తించారు. దాడి జరిగిన వెంటనే దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌ గురువారం హైదరాబాద్‌ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్‌లో ఉండగా.. శ్రీనివాస్‌ అనే వెయిటర్‌.. సెల్ఫీ తీసుకుంటానంటూ వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చారు. అతను వస్తూనే.. వైఎస్‌ జగన్‌పై కోళ్ల పందెలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న వైఎస్‌ జగన్‌ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ భుజానికి తీవ్ర గాయమైంది. కత్తికి విషపూరిత పదార్థం పూసి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర గాయం కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌ బయలుదేరారు.